జేసీ బ్రదర్స్ రూటు సపరేటు...?

Update: 2017-10-06 05:30 GMT

జేసీ బ్రదర్స్ రూటే వేరు. వారు అనుకున్నది జరిగిపోవాలంతే. అందుకు ఎలాంటి వివాదాలకైనా తెరతీస్తారు. తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా అస్త్రం అలాంటిదే. వారికి పార్టీ పట్టదు. ప్రభుత్వం అంటే గిట్టదు అంటున్నారు అనంతపురం తెలుగు తమ్ముళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కార్యక్రమం ప్రారంభం రోజున శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఆరోజు ప్రతి ఇంటికీ తిరిగారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. కాని జేసీ బ్రదర్స్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు.

పార్టీ అంటే పడదు... ప్రభుత్వమంటే గిట్టదు.....

ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభమై 20 రోజులయిన సందర్భంగా అన్ని నియోజకవర్గాల నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కూడా జేసీ బ్రదర్స్ హాజరు కాలేదు. ఎంపీ నిమ్మల కిష్టప్ప, మంత్రి కాల్వ శ్రీనివాసులుతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాని జేసీ బ్రదర్స్ మాత్రం దూరంగానే ఉన్నారు. జేసీ బ్రదర్స్ పై మిగిలిన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. కేవలం నోరు వేసుకుని పడిపోతూ ప్రభుత్వాన్ని, పార్టీనీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అనంతపురంలోని ఓ ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తమ ప్రయోజానాలే జేసీ బ్రదర్స్ కు ముఖ్యమని, వారికి పార్టీ అన్నా... ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. జేసీ బ్రదర్స్ వ్యవహారాన్ని చంద్రబాబు కూడా పరిశీలిస్తున్నారని, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కుక్కిన పేనులా పడిఉండే జేసీ బ్రదర్స్ టీడీపీలో ఎందుకు చెలరేగిపోతున్నారో అందరికీ తెలుసునంటున్నారు. మొత్తం మీద జేసీ బ్రదర్ తమ రూటు వేరంటూ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారని అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నారు.

Similar News