అనంతపురంలో జేసీ బ్రదర్స్ దే ఇక హవా కొనసాగనుందా? ఇప్పటికే జిల్లాపై జేసీ పట్టు బిగించారా? అవును... టీడీపీ వర్గాలే దీన్ని అంగీకరిస్తున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని టీడీపీలో చేర్పించడం ద్వారా జేసీ అనంతపురంపై తన పట్టును మరింత బిగించారన్నది పరిశీలకుల అంచనా. ఇప్పటికే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, జేసీ దివాకర్ రెడ్డికి పడటం లేదు. ప్రతి విషయంలోనూ ఇద్దరూ పరస్పర విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనంతపురంలో రోడ్ల విస్తరణ చేయాల్సిందేనని జేసీ పట్టుపడుతున్నారు. అయితే దీనికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మోకాలడ్డుతున్నారు. జేసీ పట్టుదలతో రోడ్ల విస్తరణ పనులకు, నష్టపరిహారం అందించేందుకు నిధులు విడుదల చేయించినా పనులు సాగడం లేదు. దీనికి ప్రభాకర్ చౌదరి కారణం. ఆయన బాధితుల పక్షాన నిలవడంతో రోడ్ల విస్తరణ పనులకు ముందడుగు పడలేదు. అనంతపురం ఎమ్మెల్యే కావడంతో ఆయనకు నగరంలో పట్టున్న కారణంగానే తనను అడ్డుకుంటున్నారని జేసీ భావించి గురునాధరెడ్డిని లైన్లోకి తెచ్చారు.
రోడ్డు విస్తరణ చేయాలంటూ....
గురునాధరెడ్డితో పాటు ఇప్పుడు అనంతపురం కార్పొరేషన్లో కూడా కొందరు కార్పొరేటర్లు జేసీ పంచన చేరిపోయారు. దీంతో ఆధిపత్య పోరు మరింత వీధిన పడే అవకాశం కన్పిస్తోంది. కార్పొరేషన్ ను తన గుప్పిట్లో తెచ్చుకుంటే ప్రభాకర్ చౌదరికి అడ్డుకట్ట వేయవచ్చన్నది జేసీ ప్లాన్. అందుకే చంద్రబాబు పై వత్తిడి తెచ్చి మరీ..దగ్గరుండి గురునాధరెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో ప్రభాకర్ చౌదరి అలక వహించారు. ఆయన చేరుతున్న సమయంలో అమరావతిలో ఉండకుండా అనంతపురానికి వచ్చేశారు. తన సన్నిహితులతో మంతనాలు కొనసాగిస్తున్నారు. టిక్కెట్ విషయంలో తనకు సందేహం లేకపోయినా... వచ్చే ఎన్నికల్లో తనను ఓడించడానికి గురునాధరెడ్డి ప్లాన్ చేస్తారేమోనన్న బెంగ చౌదరికి పట్టుకుంది. అందుకే ఆయన రాకను బహిరంగంగానే ప్రభాకర్ చౌదరి వ్యతిరేకించారు. తాజాగా జేసీ రోడ్డు విస్తరణ పనులను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబుపై వత్తిడి తేవడం ప్రారంభించినట్లు సమాచారం. దీంతో మళ్లీ అనంతలో ఆధిపత్య పోరు మొదలయిందనే చెప్పొచ్చు.