వైసీపీ నేత గురునాధరెడ్డిని టీడీపీలో చేరడంపై పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకే జేసీ గురునాధరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చారు. చంద్రబాబుతో మాట్లాడి మరీ ఆయనను ఒప్పించి గురునాధరెడ్డిని పార్టీలో చేర్చుకునేలా జేసీ గట్టి ప్రయత్నమే చేశారు. గురునాధరెడ్డి పార్టీలోకి వస్తే అనంతపురంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని జేసీ చంద్రబాబుకు చెప్పి మరీ ఒప్పించారు. ప్రభాకర్ చౌదరికి, జేసీ దివాకర్ రెడ్డికి అనేక విషయాల్లో పడటం లేదు. అనంతపురం పట్టణంలో రహదారుల విస్తరణను ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుకుంటున్నారన్నది జేసీ ప్రధాన ఆరోపణ. ఆయన కొంతమందికి కొమ్ము కాస్తూ అనంతపురం పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జేసీ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ చౌదరి అడ్డుపడటం వల్లనే అనంతపురంలో రహదారుల విస్తరణ జరగడం లేదన్నది కూడా వాస్తవం.
ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టేందుకేనా?
దీంతో ప్రభాకర్ చౌదరిని మానసికంగా దెబ్బతీయాలంటే ఆయన శత్రువును పార్టీలోకి తీసుకురావాలన్నది జేసీ వ్యూహం. ప్రభాకర్ చౌదరికి, గురునాధరెడ్డికి పడదు. గత ఎన్నికల్లో ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో పోటీ చేశారు. మరో బలమైన నాయకుడు అనంతపురం పట్టణంలో ఉంటే ప్రభాకర్ చౌదరి దూకుడుకు కళ్లెం వేయవచ్చని జేసీ గురునాధరెడ్డికి నచ్చజెప్పి పార్టీలోకి తీసుకువచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున గురునాధరెడ్డి చేరికకు ఎవరైనా ఆటంకాలు కల్పిస్తారేమోనన్న అనుమానం వచ్చి జేసీ స్వయంగా గురువారం అమరావతి వచ్చారు. గురునాధరెడ్డి ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో పనిచేయరని, ఎవరైనా చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందన్న జేసీ వ్యాఖ్యలు కూడా ప్రభాకర్ చౌదరిపై జేసీకి ఎంత కోపం ఉందో ఇట్లే అర్థమవుతోంది. అయితే ప్రభాకర్ చౌదరి ఇప్పటికీ గురునాధరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నచ్చజెప్పినా ఆయన మనసులో మాత్రం మధనపడుతూనే ఉన్నారు. గురునాధరెడ్డి తన వ్యాపారాలాను కాపాడుకోవడానికే పార్టీలోకి వస్తున్నారని ప్రభాకర్ చౌదరి బహిరంగంగానే ప్రకటించారు. దీంతో అనంతపురంలో రెండు వర్గాల మధ్య సఖ్యత ఉండేట్లు కన్పించడం లేదు.