కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అటు అధికారపార్టీ ఇటు విపక్ష ఎంపీలు పూర్తి స్థాయిలో పెదవి విరిచారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ జెసి దివాకరరెడ్డి ఎప్పటిలాగే విభిన్నంగా స్పందించారు. గత నాలుగేళ్లుగా ఎంపీలు ఈ ఢిల్లీ ప్రభుత్వం దగ్గర సాధించింది ఏమి లేదంటూ చేతులు ఎత్తేశారు. కేంద్రం దృష్టి లో ఏపీ టిడిపి కరివేపాకే అని తేల్చారు జెసి. తమ ముఖ్యమంత్రి ఆలోచన పరుడు అని మరి ఆయన ఆలోచన ఏమిటో అంటూ ఆయనకు చురకలు వేశారు జెసి. ఇక కేంద్రమంత్రి సుజనా చౌదరి పాత పాటే పాడారు. కేంద్రంపై వత్తిడికి కృషి చేస్తామని ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు.
ఎంపీలు, నేతలు ఇలా ...
మరికొందరు టిడిపి ఎంపీలు ఇదా కేంద్ర బడ్జెట్ అంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సన్నాయి నొక్కులు నొక్కారు. బడ్జెట్ లో అంతర్గతంగా ఇంకా ఏదో రాష్ట్రానికి మేలు జరిగే అవకాశాలు వున్న తీరును వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాత్రం మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి వైపు పయనిస్తున్న రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సహం ఇదేనా అని ప్రశ్నించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అమిత్ షా టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. లక్ష కోట్లు తెలంగాణ కు అన్నారు కదా ఇదేనా అని ప్రశ్నించారు. ఇక టి కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కేంద్రంతో అంట కాగినా తెలంగాణకు ఫలితం దక్కలేదంది. ఏపీ సీఎం ఇంకా ఆచితూచి ధోరణిలో వున్నారు.బహిరంగంగా స్పందించేందుకు ఎదురు దాడి చేసేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నా అంతర్గతంగా పార్టీ శ్రేణులను కేంద్రంపై దాడికి పురమాయించారు ఆయన.
భగ్గుమన్న వైసిపి ఎంపీలు ...
వైసిపి ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి భగ్గుమన్నారు. చిట్ట చివరి బడ్జెట్ గా భావిస్తున్న తరుణంలో విభజన హామీలు లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కనీసం విశాఖ రైల్వే జోన్ ఊసే లేదంటూ కస్సుమన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా ఎప్పుడైనా చేసేందుకు సిద్ధమే అని కాకపోతే మేము రాజీనామాలు చేసి పోతే కనీసం పార్లమెంట్లో నిరసన తెలిపే వారే ఉండరన్నారు సుబ్బారెడ్డి.
సూపర్ సూపర్ అంటున్న బిజెపి ....
నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సూపర్ సూపర్ అన్నాయి తెలంగాణ, ఏపీ పార్టీ శాఖలు. దేశ దశ దిశా మారిపోతుందని సంబరం వ్యక్తం చేశాయి. దీర్ఘ కాలిక లక్యంతో కేంద్రం బడ్జెట్ కి రూపకల్పన చేసిందని టి బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
మోడీ పేరు వింటే తడిసిపోతుంది ...
ఇక సిపిఐ నేత నారాయణ తనదైన శైలిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చీవాట్లు పెట్టారు. మోడీకి ఎందుకు సాగిలపడుతున్నారని నిలదీశారు. మోడీ పేరు చెబితే చాలు ప్యాంట్ లు తడిసిపోతున్నాయి ఎందుకని దుమ్మెత్తిపోశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పోరుబాట పట్టాలని నారాయణ హితబోధ చేశారు.