ఇప్పుడు ఈ విషయం మీదే చర్చ నడుస్తోంది. ఎస్సీ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన సీనియర్ పొలిటీషియన్.. జూపూడి ప్రభాకర్‌కు సీఎం చంద్రబాబు ప్రమోషన్ ఇస్తున్నారుట..! ఎస్సీ కార్పరేషన్ చైర్మన్‌గా జూపూడి మంచి పేరు సంపాయించుకున్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఆయన వ్యవహరించిన తీరు బాబును ఆకట్టుకుంది. అదే సమయంలో జూపూడి.. రాజకీయంగానూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వ్యవహరించారు. దీంతో ఎస్సీల్లో ఇప్పుడు చంద్రబాబు పేరు మార్మోగుతోంది. దీంతో చంద్రబాబు వద్ద జూపూడికి మంచి మార్కులు పడ్డాయి. ఇక, ఇదిలావుంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా జూపూడి పదవీ కాలం ముగిసింది.
ఈసారి ఎస్సీ కార్పొరేషన్ కాదు...
దీంతో .. ఆయన సామర్ధ్యాన్ని గుర్తించి.. చంద్రబాబు తిరిగి ఆయన కు చైర్మన్ గిరీ అప్పజెప్పడం ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుని అత్యంత కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పోస్టును అప్పగించాలని చూస్తున్నారట. విభజన తర్వాత ఏపీకి వచ్చిన ఆర్టీసీ చాలా కష్టాల్లో ఉంది. ఆర్థిక నష్టాలు సహా ఆస్తుల నష్టాలు సైతం ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దీనిని సమర్ధంగా నిర్వహించగలిగే వ్యక్తి అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి స్థితిలో సమర్థవంతుడైన జూపూడికి ఆ పదవి ఇస్తే...ఆర్టీసీని మళ్లీ లాభాల బాటలోకి తీసుకువస్తారనే భావనతో ముఖ్యమంత్రి ఉన్నారట. కనీసం నష్టాలు లేకుండా ఆర్టీసీని నడిపించాలని బాబు కోరుతున్నారట.
ఆర్టీసీ ఛైర్మన్ గా....
దీంతో.. జూపూడిని ఆ పదవికి ఎంపిక చేయాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు..ఈ పదవిని ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తిలకు ఇస్తారని అందరూ భావించారు. వీరు చాన్నాళ్లుగా పార్టీలో ఉన్నా ఎలాంటి పదవులూ పొందలేదు. దీంతో వారికి ఇవ్వడం ద్వారా అసంతృప్తిని తగ్గించుకోవాలని బాబు భావించారు. అయితే..వారి వల్ల సంస్థకు పెద్దగా ఉపయోగం ఉండదని, సమర్థుడు, పాలనపై పట్టు ఉన్న జూపూడి అయితే సంస్థకు న్యాయం చేసినట్లు అవుతుందని బాబు మరో ఆలోచన చేసినట్టు చెబుతున్నారు.
వీరి పేర్లు పక్కన పెట్టి...
కరణం, రామసుబ్బారెడ్డి ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో పదే పదే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంట్లో నలుసులా మారి, వారిపై విమర్శలు చేస్తూ చంద్రబాబుకు సైతం చికాకుగా మారారు. ఈ క్రమంలోనే ముందుగా ఆర్టీసీ ఛైర్మన్ పదవికి వారిద్దరి పేర్లు పరిశీలించిన చంద్రబాబు చివరకు వారిని పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఇక జూపూడి విషయానికి వస్తే ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయన సమర్థవంతంగా పనిచేసి ఫలితాలను సాధించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. దీంతో... ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.