దక్షిణం నుంచి తూర్పు కి మారిన జానారెడ్డి..!

Update: 2017-11-10 06:55 GMT

జానారెడ్డి సీనియర్ నేత. ఆయన ఎటువంటి జాతకాలను, ముహూర్తాలను, వాస్తులను అస్సలు నమ్మరు. కానీ జానారెడ్డి కార్యాలయానికి వాస్తు దోషముందని చెప్పారు. ఇంతకీ వాస్తు దోషం ఉందని చెప్పిందెవరో తెలుసా...? బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయన జానా కార్యాలయానికి ఇటీవల వచ్చినప్పుడు ఈ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జానారెడ్డి దక్షిణంలో తన కార్యాలయంలో కూర్చుంటున్నారట. కాని అది మంచిది కాదని, అదే ప్రకారం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కూర్చునే వారని, ఆయన పార్టీకి తెలంగాణలో కలిసి రాలేదని, దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని ఎన్వీఎస్ఎస్ అక్కడి కాంగ్రెస్ నేతలకు ఉదాహరణలతో సహా చెప్పారట. ఇదే విషయాన్ని జానారెడ్డి దృష్టికి తీసుకురాగా తాను ఇటువంటి వాటిని నమ్మనేనమ్మనని చెప్పారట. కాని వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచి సీఎం కావాల్సి ఉండగా మీరు ఇటువంటివి నమ్మి తీరాలని కాంగ్రెస్ నేతలు గట్టిగా పట్టుబట్టడంతో జానా తన కుర్చీని దక్షిణం వైపు నుంచి తూర్పు వైపునకు మార్చేందుకు అంగీకరించారట.

బీజేపీ ఎమ్మెల్యే చెప్పాడని....

ముహూర్తాల మీద, వాస్తుల మీద నమ్మకం బాగా పెరిగింది. ఇటీవలే గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తాను ప్రయాణించే మార్గాన్ని వాస్తు పండితుల సలహా మేరకు మార్చేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వినియోగించిన మార్గాన్ని వాడాలని ఉత్తమ్ కు సూచించడంతో అప్పటి నుంచి ఉత్తమ్ దాన్నే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర మార్గం గుండా వచ్చి వెళుతున్నారు.ఉత్తమ్ దారి మార్చిన తర్వాతనే పార్టీలో చేరికలు పెరిగాయని కాంగ్రెస్ నేతలు కూడా విశ్వసిస్తున్నారు. తాను దారి మార్చిన తర్వాతనే రేవంత్ లాంటి వాళ్లు వచ్చి చేరారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంగీకరిస్తున్నారట. అయితే జానారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చిన సూచన మేరకు సీటు మార్చుకోవడంపై అసెంబ్లీ లాబీల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. సీటు మారిన తర్వాతైనా జానారెడ్డికి సీఎం అయ్యే అదృష్ట యోగం పడుతుందేమో..చూడాలి.

Similar News