2019లో తెలుగుదేశం పార్టీకి ఏపీలో స్టార్ క్యాంపెయినర్ ఎవరు అంటే? వెంటనే వినిపించే పేరు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తర్వాత మంత్రి లోకేష్!! మరి తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసే వారెవరు అంటే? ఇదేం ప్రశ్న అనే సందేహం రావడం సహజమే అయినా.. వినిపించే పేరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్!! కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే కేసీఆర్ కంటే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. నేనున్నా అంటారేమో! జానారెడ్డి ఏమిటి.. కేసీఆర్‌కు ప్రచారం చేయడమేంటి? అయినా కాంగ్రెస్‌ను కాదని.. అంతటి పెద్దాయన కేసీఆర్‌కు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడమేంటనేగా మీ సందేహం!
ఇబ్బందుల్లో జానారెడ్డి....
రాజకీయాల్లో సవాళ్లు-ప్రతిసవాళ్లు సహజమే! ఇది కూడా రాజకీయ నాయకుల సీనియారిటీ, వారికి ఉన్న విలువలు, సిద్ధాంతాలు.. ఇతర అంశాలపై సవాలుకు స్పందిచాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. మరి రాజకీయాల్లో కాకలు తీరిన వారిని చూసిన సీనియర్లు ఇలాంటి సవాళ్లు విసరనే విసరరు! ఒకవేళ విసిరితే అది సంచలనమే అవుతుంది. అలాంటి సవాలునే గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విసిరారు కాంగ్రెస్ నేత జానారెడ్డి! అంతటి పెద్దాయనే తనకు సవాల్ విసురుతారా అని పంతం పట్టారో ఏమో గాని.. కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇదే ఇప్పుడు జానారెడ్డిని ఇబ్బందుల్లో పడేసింది.
విలువల్ని పాటించే నేత....
రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే.. తానే స్వయంగా టీఆర్ఎస్‌కు ఓటు వేయమని ప్రచారం చేస్తానని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కీర్తిస్తానంటూ గతంలో సవాలు విసిరారు జానారెడ్డి. మిగిలిన నేతల మాటల్ని లైట్ గా తీసుకోవచ్చు. కానీ జానారెడ్డి అందరిలాంటి వారు కదా. విలువల్ని పాటించే పాత తరానికి చెందిన ఆఖరి వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి జానా రెడ్డి స్వయంగా తనకు తానే కమిట్ అయిన తర్వాత.. దాన్ని ఆయన అమలు చేయకుంటే అస్సలు బాగోదు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అన్నది సాధ్యమే కాదన్న జానారెడ్డికి.. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో.. గతంలో మాదిరి తాను విసిరిన సవాల్‌ను అమలు చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగామారింది.
జానా ఇప్పుడు ఏం చేయనున్నారు?
ఒకవేళ.. తాను గతంలో చెప్పినట్లు ప్రచారానికి సై అంటే అంతకు మించిన విజయం కేసీఆర్‌కు మరొకటి ఉండదు. మాట తప్పితే దీనినే టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ జానారెడ్డి తన సవాలును స్వీకరిస్తే.. ఇక అంత కంటే టీఆర్ఎస్‌కు కావాల్సింది మరొకటి ఉండదు. జానారెడ్డి లాంటి పెద్దమనిషి తమ తరఫున ప్రచారం చేస్తే.. కేసీఆర్‌కు ఇంకేం కావాలి! గతంలోనూ కేసీఆర్ ప్రభుత్వంపైనా జానా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే! రూ.5లకే భోజనం ప్రారంభించిన సందర్భంలో స్వయంగా ఆయన..అక్కడ భోజనం చేసి బాగుందని కితాబ్ ఇచ్చారు. అంతేగాక అసెంబ్లీ సమావేశాల్లోనూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ సభ్యులను కట్టడి చేశారనే విమర్శలు వినిపించారు!!