జానారెడ్డి అట్టర్ ఫెయిలయ్యారా?

Update: 2017-11-17 01:30 GMT

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోంది. సమన్వయం లేకపోవడం, సరైన హోం వర్క్ చేయకపోవడంతో ప్రతి విషయంలో్ అధికార పార్టీదే పైచేయిగా కన్పిస్తోంది. అంది వచ్చిన అవకాశాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేక కాంగ్రెస్ పార్టీ చతికల పడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు సరైన రీతిలో కౌంటర్ ఇవ్వలేక కకావికలమవుతోంది. ఇందులో ప్రధానంగా సీఎల్పీ నేత జానారెడ్డి తప్పిదమే ఎక్కువగా ఉందంటున్నారు. జానారెడ్డి దూకుడుగా వ్యవహరించకపోవడం, అందరిని కలుపుకుని వెళ్లకపోవడం వల్లనే అధికార పార్టీకి అదృష్టంగా మారిందని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. శాసనసభలో నవ్వుల పాలవ్వడానికి ప్రధాన కారణం జానారెడ్డి అని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. దీంతో జానారెడ్డి సహచరుల మీద సీరియస్ అయినట్లు తెలిసింది. అసలు మైకే ఇవ్వనప్పుడు ఏం చేయాలని వారిని ప్రశ్నించారట. వేరే ఎవరైనా లీడ్ చేయమని ఆయన విసురుగా మాట్లాడినట్లు తెలిసింది.

ఎటువంటి హోంవర్క్ లేకుండానే....

ఎటువంటి ముందస్తు వ్యూహం లేకుండా కాంగ్రెస్ పార్టీ శాసనసభలోకి అడుగుపెడుతోంది. దాదాపు పదిహేను రోజుల నుంచి ఇదే తంతు. అయినా వారిలో మార్పు రాలేదు. ఎటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా సభలో అడుగుపెట్టడం, ముందస్తు సమావేశాలు లేకపోవడం వల్లనే సభలో సరైన రీతిలో కాంగ్రెస్ స్పందించలేకపోతుందని వీహెచ్ లాంటి సీనియర్ నేతలు కూడా తప్పు పడుతున్నారు. తెలంగాణ సర్కార్ నాలుగు విడతలుగా రైతులకు రుణాలు మాఫీ చేసింది. అయితే రుణ మాఫీ కాకుండా వడ్డీని కూడా మాఫీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వడ్డీ అందని రైతులు లక్షల్లో ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. కావాలంటే ఆ జాబితాను తాము సభ ముందు ఉంచుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిని తొందరపాటు చర్యగా కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నారు. బ్యాంకుల వారీగా రుణమాఫీ జాబితాను, వసూలు చేసిన వడ్డీ వివరాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ రివర్స్ లో తామే వడ్డీతో ఇబ్బంది పడుతున్న రైతుల జాబితాను ఇస్తామని ప్రకటించడం తప్పిదమే. దీంతో ప్రభుత్వం ఆ జాబితాను దమ్ముంటే సభలో ప్రవేశపెట్టాలని కోరింది. కేసీఆర్ కూడా ఆ జాబితాను పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ నీళ్లు నమలాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీరి వద్ద ఆ జాబితా లేదు. ఆధారాలు లేవు. ఏదో అలవోకగా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వానిదే పైచేయి అయింది. ఇక ముస్లిం రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేక పోయింది. 12 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని అధికార పార్టీని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ తాము 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని, టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందనే చెప్పి ఊరుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి కాంగ్రెస్ జాతకం మొత్తం బయటపెట్టారు. ముస్లిం రిజర్వేషన్లకు కలుగుతున్న ఆటంకాలను వివరించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అట్టర్ ఫెయిల్ అయింది. ఇలా వరుసగా కాంగ్రెస్ పార్టీ విఫలమవ్వడానికి ముందస్తు వ్యూహం లేకపోవడమేనన్నది ఆ పార్టీ నేతల ఆరోపణ. మొత్తం మీద ఈ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రతి విషయంలో ఇరుకున పెడుతూనే ఉంది. పాపం... కాంగ్రెస్.

Similar News