జయలలితను విదేశాలకు తీసుకెళ్తారా?

Update: 2016-10-06 02:25 GMT

జయలలిత ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆస్పత్రి వర్గాలు సవివరమైన నివేదికను హైకోర్టుకు సమర్పించాయి. ఆమె ఆరోగ్యం గురించి ఇవాళ హైకోర్టులో పిటిషన్ ను విచారిస్తారు. అయితే ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా బయటకు సమాచారం పొక్కుతోంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి.. జయలలితకు అపోలోలో మెరుగైన చికిత్స అందిన తరువాత.. ఆమె ఆరోగ్యం కుదుట పడగానే.. ఆమెను మరింత మంచి చికిత్సకోసం అమెరికా లేదా లండన్ కు తీసుకువెళ్తారని అంటున్నారు.

గురువారం ఎయిమ్స్ నుంచి డాక్టర్ల ప్రత్యేక బ్రుందం చెన్నై కు రానుంది. వారు జయలలితను పరీక్షించి ఎలాంటి చికిత్సలు అందించాలి.. పరిస్థితి ఎలా ఉన్నది అనేది అధ్యయనం చేస్తారు. ఇప్పటికే లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్ బాలె వచ్చి ఆమె చికిత్సకు సలహాలు సూచనలు చెప్పి వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే జయలలిత కు రాజకీయ మార్గదర్శకుడు , ఎంజి రామచంద్రన్ కూడా అప్పట్లో కిడ్నీ సమస్యతోనే బాధ పడ్డారు. ఆయనకు సుదీర్ఘకాలం చెన్నయ్ అపోలోలోనే చికిత్స అందించిన తర్వాత.. కాస్త కుదుటపడగానే అమెరికాకు తీసుకువెళ్లారు. సుమారు నాలుగు నెలల తర్వాత ఆయన ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. ఇప్పుడు కూడా జయలలితకు కాస్త కుదుటపడితే.. లండన్ లేదా, అమెరికా పంపే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఎయిమ్స్ వైద్యులు వచ్చి వెళ్లిన తర్వాత.. మరిన్ని వివరాలు తెలియవచ్చునని అనుకుంటున్నారు.

Similar News