ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాది గడుస్తున్నా ఆమె మరణంపై అనుమానాలు తొలగిపోలేదు. తమిళనాడు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ఎదుట కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. జయ మృతిపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగ స్వామిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ జయలలితకు వైద్యం అందించిన ప్రభుత్వ వైద్యులైన ముత్తుసెల్వన్, ధర్మరాజ్, డిట్టో, బాలాజీలను విచారించింది. అయితే వీరి విచారణలో ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూశాయి. జయలలితకు తాము ఎలాంటి వైద్యం అందించలేదని వీరు చెప్పడం విస్మయాన్ని కల్గిస్తోంది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన వెంటనే ప్రభుత్వం వైద్యుల బృందాన్ని నియమించింది. వారే దగ్గరుండి జయ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. కాని వీరు కమిషన్ ఎదుట మాత్రం తాము జయకు ఎలాంటి వైద్యం అందించలేదన్నారు. అసలు తాము జయను చికిత్స జరిగనన్ని రోజూలూ చూడలేదన్నారు. తమను జయ గదిలోకి పంపకుండా, పక్క గదిలోనే కూర్చోబెట్టేవారని తెలిపారు. అపోలో వైద్యులు ఇచ్చిన హెల్త్ బులిటెన్ ను తాము చదివి విన్పించేవారమని చెప్పారు. అయితే దీనికి కమిషన్ మిమ్మల్ని ప్రభుత్వం నియమించింది కదా? జయను ఎందుకు చూడలేదు? అన్న ప్రశ్నకు తమకు ఉన్నతాధికారి నుంచి ఆదేశాలయన్నారని తెలిపారు. దీంతో జయ కు చికిత్స అందించడానికి వెళ్లనీయకుండా ప్రభుత్వ వైద్యులను అడ్డుకున్నఆ ఉన్నతాధికారు ఎవరన్నది ఇప్పుడు కమిషన్ తేల్చాల్సి ఉంది.
అన్నీ అనుమానాలే....
ప్రభుత్వం నియమించిన బృందాన్నే జయకు చికిత్స అందిస్తున్న గదిలోకి రానివ్వలేదంటే అంత రహస్యంగా ఆమెకు ఏ చికిత్స చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే జయకు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆక్యపంక్చర్ వైద్య నిపుణుడు శంకర్ తెలిపారు. జయను ఆసుపత్రిలో చేర్చడానికి ముందు శంకర్ జయకు వైద్యం అందించారు. శంకర్ కూడా కమిషన్ ఎదుట సాక్ష్యమిచ్చారు. జయను అపోలో ఆసుపత్రిలో చేర్చడానికి ముందే మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇచ్చారని ఆయన చెప్పడం సంచలనం కల్గిస్తోంది. దీంతో విచారణ సంఘం తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులను కూడా విచారించనుంది. మొత్తం జయలలిత మరణంలో మిస్టరీ ఉన్నట్లు కమిషన్ ఎదుట ఒక్కొక్కరుగా చెబుతున్న వాస్తవాలు తేలుతోంది. మరోవైపు కమిషన్ గడువు పూర్తి కావస్తుండటంతో విచారణకు మరింత సమయం ఇవ్వాలని కమిషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. మరింత మందిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అందుకే కమిషన్ కాలపరిమితిని పొడిగించాలని కోరింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.