జన్మభూమి అలా అయిపోయిందే ?

Update: 2018-01-07 02:30 GMT

అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళాలి. వారి సమస్యలు తెలుసుకోవడం, ఫిర్యాదులు స్వీకరించడం, ఆయా ప్రాంతాల్లో చేపట్టబోయే పనులు వివరించడం, ప్రభుత్వం అమలు చేయబోయే పధకాలు వివరించడం చేయాలి. గత జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలకు సంబంధించిన వివరాలు వెల్లడించాలి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మారిపోయింది. జన్మభూమి అంటే టిడిపి ప్రచార కార్యక్రమ ప్రధాన వేదికగా తయారు అయ్యింది. ప్రభుత్వకార్యక్రమాలు, పార్టీ కార్యక్రమం గా అధికారులు సైతం వివరించే పరిస్థితి దాపురించింది.

అసలు ఏం జరుగుతుంది...?

ఎన్నికలకు ఏడాదికి ముందు ఏర్పాటైన తాజా జన్మభూమిని వైరైటీగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు పెద్దా చిన్నా విచ్చేస్తారు. ప్రోటోకాల్ ఏమి ఉండదు. పిలిచినా పిలవకపోయినా వేదిక ఎక్కేస్తారు. అధికారులు ప్రభుత్వ పధకాల ప్రచార ప్రసంగాలు పూర్తి కాగానే నాయకుల ప్రసంగాలు మొదలౌతాయి. చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా ఎలా కష్టపడుతున్నారో వివరిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించాలని కోరతారు. అంతా అయిపోయాకా వారు వెళ్ళిపోతారు అధికారులు ఫిర్యాదులు స్వీకరించి కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నారు.

మొక్కుబడి తంతు గానే ..?

గత ఏడాది సాగిన జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదులు ఎన్ని పరిష్కరించినవి ఎన్ని ఇప్పుడు తాజా గా నమోదు అయిన ఫిర్యాదులు ఎన్ని వంటి వివరాలు తెలిపే తీరిక సమయం పాలనా యంత్రాంగానికి లేదు. దాంతో ప్రచార ఆర్భాటంగా తప్ప ప్రయోజన కరంగా ఈ కార్యక్రమం సాగకపోవడం విమర్శలకు తెరతీసేలా చేసింది. జవాబుదారీ తనం లేకపోవడంతో గతంలో జన్మభూమి అంటే ఒణికి పోయే అధికారులు ఈసారి కూల్ గా ప్రచారం చేసి పోతున్నారు. ప్రజలు గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం కోసం ఎక్కడైనా ప్రజలు నిలదీస్తే నిధుల కొరత ఉందని, మంజూరు చేసిన వెంటనే పని పూర్తి చేస్తామన్న సమాధానం వస్తుంది. ఎందుకు పనులు పూర్తి చేయలేదని సాక్షాత్తు అధికార పార్టీ నాయకులే నిరసనలు వ్యక్తం చేయడం సభలను బహిష్కరించడం అనేక చోట్ల కనిపించింది. దాంతో ఈసారి జన్మభూమి అంతా ఒక మాయే అంటున్నారు వీటిని పరిశీలించి విశ్లేషించిన వారు.

Similar News