వైసీపీ అధినేత జగన్ బంతిని జనసేనాని కోర్టులోకి నెట్టేశారు. మార్చి 21 వతేదీన వైసీపీ పార్లమెంటులో కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతుందని, దానికి అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు. అంతేకాదు తెలుగుదేశం పార్ట్ నర్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతిచ్చేలా ఒప్పించాలని కోరారు. గతంలో జగన్ రాజీనామాల అంశాన్ని ప్రస్తావించినప్పుడు పవన్ కల్యాణ్ అవిశ్వాసం తీర్మానం పెట్టాలని కోరారు. అందుకు స్పందించిన జగన్ అవిశ్వాసం పెట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
మద్దతు కూడగట్టాలి....
అయితే పవన్ కల్యాణ్ మాత్రం వైసీపీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే రోజున అవిశ్వాసం పెట్టాలన్నారు. అలా వైసీపీ పెడితే తాను తమిళనాడు, కర్ణాటకలు తిరిగి అన్ని పార్టీల మద్దతు కూడ గడతానన్నారు. అంతేకాదు ఢిల్లీకి వచ్చి అవిశ్వాసానికి మద్దతివ్వాలని అన్ని జాతీయ పార్టీలనూ కోరతానన్నారు. రాహుల్ గాంధీని కూడా కలుస్తానని చెప్పారు. జగన్ కు దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని కోరారు. పవన్ కల్యాణ్ సవాల్ ను స్వీకరించిన జగన్ అవిశ్వాసానికి డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 21వ తేదీన అవిశ్వాసం పెట్టనున్నట్లు ప్రకటించారు.
ఇచ్చిన మాట మీద నిలబడాలి....
ఏప్రిల్ 10 వతేదీ వరకూ పార్లమెంటు సభలు జరుగుతాయని, తాము 21వ తేదీన అవిశ్వాసం పెట్టినా స్పీకర్ అనుమతిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో జగన్ పవన్ కల్యాణ్ ను తాము పెట్టబోయే అవిశ్వాసానికి మద్దతును కూడగట్టాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతును సంపాదించాలని పవన్ కల్యాణ్ ను కోరారు. తాము ఎట్టిపరిస్థితుల్లో అవిశ్వాసానికి వెనక్కుతగ్గబోమని, అలాగే పవన్ కల్యాణ్ కూడా తాను అన్న మాట మీద నిలబడి, మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉండాలని జగన్ కోరారు. జగన్ తెలివిగా బాల్ ను జనసేనాని కోర్టులోకి నెట్టేశారు. మరి జనసేనాని స్పందన ఎలా ఉంటుందో చూడాలి.