జనసేనాని ఇక ‘‘సీన్’’ లోకి....!

Update: 2018-02-22 09:30 GMT

ప్రత్యేక హోదా నినాదం ఇప్పుడు మరోసారి ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీలకు వజ్రాయుధంగా దొరికింది. ఇటు వైసీపీ ఎప్పుడో ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకోగా, టీడీపీ తాజాగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుంది. అయితే వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాను అందిపుచ్చుకుందామని నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ఆయన ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చర్చించి ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించారు.

దశలవారీగా ఉద్యమం....

అయితే పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీ తొలుత విద్యార్ధి ఉద్యమాలను ప్రారంభించాలని నిర్ణయించింది. తెలంగాణలో కూడా ఉద్యమసమయంలో విద్యార్థులే అండగా నిలిచి పోరాటాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్ తొలుత అన్ని యూనివర్సిటీల్లో సమావేశాలు పెట్టి విద్యార్థుల్లో చైతన్యం తేవాలని నిర్ణయించారు. దీంతో పాటుగా పార్టీ తరుపున తానే స్వయంగా దీక్షకు దిగాలని కూడా పవన్ నిర్ణయించారని చెబుతున్నారు. అయితే దీక్ష తేదీ పార్టీ ప్లీనరీ తర్వాతనే ఉండవచ్చని తెలుస్తోంది. మార్చి నెలలో జనసేన ప్లీనరీ గుంటూరులో జరగనుంది.

దీక్షకు దిగాలన్న యోచనలో....

ప్లీనరీ ముగిసిన తర్వాత గుంటూరులో గాని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. పార్లమెటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో దీక్షకు దిగితే కొంత కేంద్రంపై వత్తిడి తేవచ్చన్నది పవన్ వ్యూహంగా కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకోవచ్చని, అయితే ముందుగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన ముందుండాలన్నది పవన్ నిశ్చయంతో పార్టీ వర్గాలు ఆ దిశగా ఏర్పాట్లు ప్రారంభించాయి.

ప్రత్యేకంగా రూపొందించిన టీ షర్టులతో....

ముందుగా జనసేన కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు నినాదంతో టీ షర్టులను జనసేన పార్టీ ఇప్పటికే తయారు చేయించింది. ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొనే పార్టీ కార్యకర్తలు విధిగా ఈ టీ షర్టులు ధరించాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా నినాదంతో పాటుగా జనసేన సింబల్ ను ఈ టీ షర్టు మీద ముద్రించారు. ప్రత్యేక హోదా నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నది పవన్ కల్యాణ్ కొత్త వ్యూహం. మరి జనసేన ఒక్కటే ఈ ఆందోళనలను చేపడుతుందా? మిగిలిన పార్టీలను కలుపుకుని ముందుకు వెళుతుందా? అన్నది చూడాలి.

Similar News