జనసేన లక్ష్యం పగ ప్రతీకారమా ...?

Update: 2017-12-07 03:30 GMT

ఎప్పుడెప్పుడా అని అభిమానులు కొత్త సినిమా కోసం ఎదురుచూసినట్లు జనసేన పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూశారు. వారు ఆశించిన స్థాయిలో సినీ స్టయిల్ లోనే మసాలా దట్టించి అన్ని పార్టీలమీద విరుచుకుపడ్డారు జనసేనాని. విశాఖ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రజారాజ్యం మిగిల్చిన చేదు అనుభవాలను, అన్నయ్య పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్రమంత్రి హోదా దక్కించుకుని మర్చిపోయినా నాటి యువరాజ్యం అధినేత మరువలేక పోతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలు వల్లెవేస్తూ ఆనాటి పార్టీకి ద్రోహం తలపెట్టిన ప్రతి ఒక్కరి పని పడతా అని ప్రతిజ్ఞ చేశారు పవన్. అన్ని ప్రధాన పార్టీలను తూర్పారబట్టిన ఆయన తన లక్ష్యం అధికారం కాదనడంతో జనసేన పార్టీ దేనికోసమంటే పగ ప్రతీకారం కోసమే అన్నట్లు సాగుతుందా అని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో లాగే ప్రేమ, పగ ప్రతీకారం అనే ఎలిమెంట్ చుట్టూ జనసేన కధ నడిపిస్తారా ఏమిటి అని కొందరు అప్పుడే వ్యంగ్యాస్త్రాలు మొదలెట్టేశారు.

సినిమాల్లో ఏ అనుభవం లేకపోయినా ...

ఆ...యా కుటుంబ నేపథ్యాల ఫలితంగా రాజకీయమేనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగాలకైనా ఎక్కువమంది ప్రభావితం అవుతూ వుంటారు. తాజాగా జనసేనాని వారసత్వ రాజకీయాలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు. విజయవాడ లో జరిగిన ఒక కార్యక్రమంలో తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్న పవన్ విశాఖలో మాత్రం జగన్, లోకేష్ లపై విసిరిన పంచ్ ల్లో వచ్చిన మార్పు అందరిలో చర్చగా మారింది. ప్రత్యర్థి పార్టీల్లోని ఇద్దరు యువనేతలను తక్కువ చేసే ఉద్దేశ్యంతోనే పవన్ ప్రచారం మొదలు పెట్టారా ? దానివల్ల జనసేన మాత్రమే స్వచ్ఛ రాజకీయాలకు వేదికనే సందేశాన్ని యువతకు పంపారా ? అనుభవం వుండే వారే ఎమ్యెల్యే , ఎంపీ , మంత్రి ముఖ్యమంత్రి కావాలని అభిలషిస్తున్న జనసేనాని రాబోయే ఎన్నికల్లో టిడిపి, వైసిపి , బిజెపి కాంగ్రెస్ లో టికెట్లు దక్కని వారికి ఇప్పుడే భరోసా ఇచ్చి అనుభవజ్ఞులు దొరికారాని సంతృప్తి పరిచేందుకే ఇప్పటినుంచి ప్రిపేర్ చేస్తున్నారా ? అధికారం రాజకీయ ఆటలో పరమావధిగా లేనప్పుడు జనసేనను నమ్ము కోవడానికి టికెట్లు ఆశించే వారు ఎంత వరకు ముందుకు వస్తారు ? ఇలా అనేక ప్రశ్నలకు జవాబులకోసం ఇప్పుడు అంతా వెతుక్కునే పనిలో పడ్డారు మరి.

Similar News