జనసంద్రంగా గిరిజన జాతర....మేడారం...!

Update: 2018-02-01 03:30 GMT

మేడారం జనసంద్రమైంది. భక్తజనంతో పులకించిపోయింది. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు మేడారం చేరుకున్నారు. ఆదివాసీల ఆచారం ప్రకారం సారలమ్మను గద్దెపై ప్రతిష్టించారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు ముందుగానే మేడారం చేరుకున్నారు. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతర ప్రారంభమయింది. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని బెల్లాన్ని సమర్పించుకునేందుకు ఐదు రాష్ట్రాల నుంచి ప్రజలు మేడారం చేరుకుంటున్నారు. నిన్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెపై ప్రతిష్టించడంతో వేడుక ప్రారంభమయింది.

నేడు చత్తీస్ ఘడ్ సీఎం రాక....

జాతరలో మరో ముఖ్యఘట్టమైన సమ్మక్కను ఈరోజు గద్దెపైకి తీసుకురానున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను ఈరోజు గిరిజన పూజారలు తీసుకురానున్నారు. ఇది వేడుకలో అత్యంత కీలకఘట్టం. శుక్ర, శనివారాల్లో జాతర కొనసాగుతుంది. సమ్మక్కను అధికారిక లాంఛనాలతో తీసుకురానున్నారు. పోలీసులు ఈ సందర్భంగా గాల్లోకి కాల్పులు కూడా జరుపుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు ఇప్పటికే మేడారం చేరుకున్నారు. ఈరోజు చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మేడారానికి వచ్చి సమ్మక్క, సారలమ్మను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వ ఏర్పాట్లు భేష్....

ఈసారి మేడారం జాతరకు భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మేడారంలో బస చేసేందుకు తెలంగాణ పర్యాటక శాఖ విలాసవంతమైన గుడారాలను నిర్మించింది. ఈ గుడారాల అద్దె రోజుకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకే ఇక్కడ గుడారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఒక కుటుంబం ఇక్కడ విడిది చేసే అవకాశముంటుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.

తీవ్రమైన ట్రాఫిక్ సమస్య.....

మేడారం లో ట్రాఫిక్ అదుపుతప్పింది.ఎక్కడికక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మేడారం చేరుకోవాలంటేనే కష్టంగా మారింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. వెంటనే డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం వెళ్లారు. స్థానిక అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు చత్తీస్ ఘడ్ సీఎం వస్తుండటంతో భద్రత ఏర్పాట్లను డీజీపీ పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు మేడారంలో భక్తుల సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు.

Similar News