జనగణమన... జాతి యావత్తూ ప్రతిధ్వనించాల్సిందే!

Update: 2016-11-30 08:10 GMT

జాతీయ గీతానికి సర్కారీ పాఠశాలల్లో తప్ప మరెక్కడా మన్నన దక్కని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్న రోజులివి. కొన్ని రాష్ట్రాల్లో జాతీయగీతాన్ని పక్కన పెట్టి రాష్ట్రగీతాల్ని పాడుకుంటూ.. విద్యార్థుల్ని అంతవరకే పరిమితం చేసేయడం కూడా జరుగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో విద్యార్థులను మినహాయిస్తే, అసలు జాతీయగీతం పూర్తిగా పాడగలిగిన వారు ఈ దేశంలో పది శాతం అయినా ఉంటారనుకోవడం భ్రమే. అలాంటి నేపథ్యంలో జాతీయగీతం ‘జనగణమన’ అంటూ జాతి మొత్తం ప్రతిద్వనించాల్సిందేనంటూ సుప్రీం న్యాయస్థానం బుధవారం నాడు జోక్యం చేసుకుంది.

దేశంలోని ప్రతి సినిమా థియేటర్ లోనూ ఆటఆటకూ ముందు జాతీయగీతం పాటను వేయాల్సిందేనంటూ సుప్రీం న్యాయస్థానం తీర్పు చెప్పింది. జాతీయగీతాన్ని, జాతీయ జెండాను దేశంలోని పౌరులందరూ గౌరవించి తీరాల్సిందేనంటూ సుప్రీం ఆదేశించింది. పైగా సినిమా థియేటర్లలో జాతీయగీతం ప్లే చేసేప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా లేచి నిల్చుని గౌరవం ప్రకటించాలని కూడా తీర్పులో సుప్రీం పేర్కొంది.

నిజానికి ప్రతి సినిమా థియేటర్ లోనూ ఆట మొదలు కావడానికి ముందుగా జాతీయగీతం వేయాలనే నిబంధన ఎప్పటినుంచో ఉంది. అయితే ఆచరణలో థియేటర్ల యాజమాన్యాలు దాన్ని తుంగలో తొక్కేశాయి. కొన్ని చోట్ల సుమారు అరగంట పాటూ వాణిజ్య ప్రకటనలు వేస్తుంటారు గానీ.. జాతీయగీతం వేయాలని నిబంధన మాత్రం పాటించరు. ఇలాంటి నేపథ్యంలో సుప్రీం తీర్పు ఇలాంటి వారందరికీ చెంపపెట్టు కానుంది. విధిగా ప్రతి సినిమాహాలులోనూ జాతీయగీతం ప్లే చేస్తే.. వాస్తవంగా ప్రజల్లో కూడా కొంత జాతీయతా భావన ఏర్పడడానికి అది ఖచ్చితంగా ఎంతో కొంత దోహదం చేస్తుంది.

Similar News