వైఎస్ జగన్మోహనరెడ్డి... వైఎస్సార్ వారసత్వపు కోటాలో ఒక్క ఉదుటున రాష్ట్ర ముఖ్యమంత్రి సింహాసనం పై కూర్చునే అర్హత తనకు మాత్రమే ఉన్నదని భావించిన వ్యక్తి. అందుకు ఆమోదించలేదని.. తన తండ్రి ఎంతో విధేయంగా సేవలందించిన కాంగ్రెస్ పార్టీ మీదనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. సొంత కుంపటి పెట్టుకున్నారు. అయితే.. ఇప్పుడు అటు అధికారాన్ని దక్కించుకోలేక.. కేంద్రంలో దన్నులేని ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కష్టాలు పడుతున్నారు.
అయితే ఈ కష్టాలన్నిటికీ కారణం ఆయనకు ఓపిక లేకపోవడమేనా? తాను తలచుకున్నంత తక్షణమే ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకోవడమేనా? 'సీఎం పదవి ఇస్తాం ' అని పార్టీ చెప్పినా కూడా కొన్నాళ్లు వేచి ఉండే ఓపిక లేకుండా, తక్షణం పదవి కావాలని పట్టుబట్టి.. ఇపుడున్న ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నారా? తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి డికె అరుణ చెబుతున్న మాటలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది.
జగన్ సొంతమైన సాక్షి టీవీలోనే , కొమ్మినేని శ్రీనివాసరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు గమనిస్తే.. జగన్‌కు తక్షణం సీఎం అయిపోవాలనే కోరికలో, ఓపిక లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఉన్న భావోద్వేగాల వల్ల జగన్ సీఎం కావాలని తామంతా కూడా సమర్థించామని, అయితే జగన్ కొన్నాళ్లు ఆగలేకపోయారని ఆమె అన్నారు.
'మనసులో మాట' అంటూ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని అంటూనే.. తెలంగాణకు సీఎం కాగల అర్హతలన్నీ తనకున్నాయని చెప్పుకున్నారు. అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కయి.. రెండు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేస్తున్నారని కూడా ఆరోపించారు.