జగన్ శిబిరం ...కిట..కిట....!

Update: 2018-01-25 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఆత్మీయ సమ్మేళనాలు, బహిరంగ సభలు, సదస్సులతో ఫుల్లుగా సాగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ తో వేల సంఖ్యలో ప్రజలు కలిసి నడుస్తున్నారు. ఆయనను ఆపి మరీ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. నెల్లూరుజిల్లాలో ఉమ్మాలపేట శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన జగన్ యాత్రను ప్రారంభించడానికి ముందే ఆయన శిబిరం వద్దకు వేల సంఖ్యలో జనం చేరుకుంటున్నారు. జగన్ ను కలిసి ఒకసారి మాట్లాడి వెళ్లాలని వారు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో జగన్ బస చేసే శిబిరం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వస్తోంది. అయితే శిబిరం నుంచి బయటకు వచ్చిన జగన్ ప్రతి ఒక్కరిని పలుకరిస్తున్నారు. కొందరు ఇచ్చిన వినతులను తీసుకుంటున్నారు.

నేతల్లో పెరిగిన విశ్వాసం....

జగన్ పాదయాత్ర నిజంగానే వైసీపీ శ్రేణుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపుతోంది. ప్రజాస్పందనచూసి వైసీపీ నేతలే అవాక్కయ్యే పరిస్థితికి వచ్చింది. తమ ఉత్సాహన్ని ఆరింతలు .జగన్ పాదయాత్ర రెట్టింపు చేసిందని నెల్లూరు జిల్లా వైసీపీ నేత చెప్పడం విశేషం. ఎక్కడికక్కడ బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, మైనార్టీలు, బీసీ, ఎస్సీ సదస్సులను ఏర్పాటు చేసి చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. నిన్న నెల్లూరు జిల్లా నాయుడు పేట వరకూ జగన్ పాదయాత్ర కొనసాగింది. ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పిన చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేకపోయినా ఇప్పటి వరకూ చంద్రబాబు 22 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదని ఎద్దేవా చేశారు జగన్. ప్రయివేటు విమానాల్లో విదేశాలకు వెళుతూ ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు దాదాపు 200 కోట్లు దుర్వినియోగం చేశారన్నారు.

నెల్లూరు మొలకొలుకులేవీ?

నెల్లూరు జిల్లాను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు జగన్. నెల్లూరు జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. నెల్లూరు మొలకొలుకులంటే ఒకప్పుడు ఫేమస్ అని... కాని ఇక్కడ నీరు లేక రైతులు ఇబ్బంది పడుతుండటం తనను కలిచి వేసిందన్నారు జగన్. సోమశిల ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలు సాగు కావాల్సి ఉండగా కేవలం 39 వేల ఎకరాల్లోనే పంట వేయడమేంటని ఆవేదన చెందారు. సోమశిల స్వర్ణముఖి కాల్వ పనులకు వైఎస్ ఆనాడు 120 కోట్లు ఖర్చు చేస్తే... మిగిలిన పనులను పూర్తి చేయడానికి చంద్రబాబుకు మనసొప్పడం లేదన్నారు. అది పూర్తయితే నెల్లూరు జిల్లాలోని 316 చెరువులకు నీళ్లొస్తాయని, కాని చంద్రబాబు మాత్రం దానిని పట్టించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్....

వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది. జగన్ ఈరోజు సూళ్లూరు పేట నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. సూళ్లూరు పేట నుంచి పూట క్రాస్ రోడ్స్, వర్ధరెడ్డి కండ్రిగ, పూనేపల్లి, నేమలపూడి వరకూ యాత్ర సాగుతుంది. నేమలపూడి వద్ద జగన్ మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి కరబులవొల్లు, వడ్డిపాలెం, సగట్టురు వరకూ ఈరోజు యాత్ర జరుగుతుంది. ఈరోజు రాత్రికి జగన్ సగట్టురు వద్ద బస చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా జగన్ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది.

Similar News