ప్రకాశం జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా జగన్ ను చూసేందుకు తరలి వస్తుండటంతో వైసీపీ నేతలు ఖుషీ అయిపోతున్నారు. తన వద్దకు వచ్చిన వారితో నేరుగా జగన్ మాట్లాడి సమస్యలు తెలుసుకుంటుండటం, వారితో ఫొటోలో దిగుతుండటంతో పాదయాత్ర మూడు రోజుల నుంచి కందుకూరు నియోజకవర్గంలోనే జరుగుతోంది. జనం ఎక్కువగా వస్తుండటంతో పాదయాత్ర ఆలస్యమవుతోంది. మూడో రోజు జగన్ కేవలం 12.6 కిలోమీటర్లు మాత్రమే నడిచారు. సాధారణంగా జగన్ రోజుకు 15కిలోమీటర్ల పైగానే పాదయాత్ర చేస్తారు. అయితే ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో పాదయాత్ర అనుకున్న సమయానికి చేరుకోలేమన్న ఆందోళన పార్టీ నేతల్లో ఉంది.
పంచాయతీ నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ....
కాని ప్రకాశం జిలాల్లో మాత్రం అది సాధ్యపడటం లేదు. దీనికి తోడు వైసీపీ స్థానిక ఇన్ ఛార్జులు ద్వితీయ శ్రేణి నేతలకు పాదయాత్రలో ప్రాధాన్యత ఇవ్వడం కూడా నడక నెమ్మదిగా సాగటానికి కారణమని చెప్పకతప్పదు. జగన్ ను చూసేందుకు, పలకరించేందుకు, ఫొటోలు దిగేందుకు పంచాయతీ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ నేతలు క్యూ కడుతున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడే వీరు కలుస్తుండటంతో కొంత ఆలస్యమవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. నూకవరం, బడేవారిపాలెం, అత్తింటి వారి పాలెం, బొంతవారిపాలెం, కాకుటూరు, చెర్లోపల్లి గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కందుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి తూమాటి మాధవరావు దగ్గరుండి జగన్ పాదయాత్ర ఏర్పాట్లు చూస్తున్నారు.
ఇప్పటి వరకూ 1240 కిలోమీటర్లు నడిచి....
వైఎస్ జగన్ ఇప్పటి వరకూ 1249 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఇన్ ఛార్జులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు జగన్ తర్వాత పర్యటించే నియోజకవర్గంలో నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజాసమస్యలు వెల్లువెత్తుతుండటంతో జగన్ వారి సమస్యలను వినతి పత్రాల రూపంలో తీసుకుంటున్నారు. పెదవెంకన్న పాలెంలో ముస్లిం మహిళలు జగన్ ను కలిశారు. ముస్లిం రిజర్వేషన్లను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల్పించారని, ఈరిజర్వేషన్లను మరింత పెంచితే తమ వర్గం విద్యార్థులు మంచి చదువులు చదువుకునే అవకాశముంటుందని చెప్పారు. వారికి జగన్ అలాగేనంటూ హామీ ఇచ్చారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్....
ఇక జగన్ ప్రజాసంకల్ప యాత్ర 93వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం శిబిరంలో ఉన్న విప్పగుంట నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చౌటపాలెం, లింగంగుంట, మలెపాడు, తిమ్మపాలెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర వేగంగా సాగేలా ఏర్పాటు చేయాలని జగన్ నిర్వాహకులను ఆదేశించారు. ఇప్పటికే మూడు నెలలు పూర్తయినా ఇంకా ఐదో జిల్లాలోనే ఉన్నందున సమయం ఎక్కువ లేదని, త్వరితగతంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను జగన్ కోరారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర నెమ్మదిగా సాగుతుండటంతో అనుకున్న సమయానికి ఇచ్ఛాపురం చేరుకుంటామా? లేదా? అన్న సందేహం కూడా వైసీపీ నేతల్లో ఉంది.