వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో దాదాపు 40 మంది పాల్గొంటున్నారు. వీరంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న వారే. వీరంతా వివిధ జిల్లాలకు చెందిన వారు. గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర లో వీరంతా పాల్గొన్నారు. దాదాపు 40 మంది సభ్యులున్న ఈ బృందంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరంతా వైఎస్ వీరాభిమానులు. నాడు తండ్రి వెంట నడిచామని, నేడు తనయుడు వెంట నడవటం ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు. జగన్ వెంట ఉన్నవారందరికీ భోజన, వసతి సదుపాయాలను వైసీపీ పార్టీయే దగ్గరుండి చూస్తుంది. పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని తండ్రి లాగే జగన్ కూడా ముఖ్యమంత్రి అవుతారని వారు చెబుతున్నారు. గత పదిహేడు రోజుల నుంచి తాము జగన్ వెంట ఉన్నామని, ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తే రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తున్నారని వారు అంటున్నారు.
నేడు పాదయాత్ర షెడ్యూల్....
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. నిన్న పాదయాత్రకు విరామమిచ్చిన జగన్ రాత్రే కర్నూులు జిల్లాకు చేరుకున్నారు. నిన్న హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ రాత్రికి రాత్రే బయలుదేరి పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తికి చేరుకున్నారు. ఆయన ఈరోజు ఉదయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 8గంటలకు వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్ రోడ్స్, తొగరచేడు క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోజన విరామానికి కృష్ణగిరి వద్ద ఆగుతారు. తిరిగి మధ్యాహ్నం 3.30గంటలకు కృష్ణగిరి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర సాయంత్రం రామకృష్ణాపురానికి చేరుకుంటుంది. అక్కడే రాత్రి బస చేయనున్నారు.