వైసీపీ అధినేత జగన్ ఏపీ పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్రలో నిఘా పెట్టడం, మహిళా సదస్సుకు రాకుండా కొందరిని అడ్డుకోవడం, ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్ లు చేయడం వంటి వాటిపై జగన్ స్పందించారు. ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, ప్రజల పక్షాన పోలీసులు నిలబడాలని జగన్ కోరారు. తన పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు జగన్. టోపీ పై ఉన్న మూడు సింహాలను గౌరవించాలని, వెనక ఉన్న గుంటనక్కలకు సహకరించ వద్దని పరోక్షంగా చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తారు. పోలీసులు నిజాయితీగా పనిచేయాలని, తన వద్దకు వచ్చే వారిని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. పోలీస్ బాస్ లకు కూడా ఈ విషయాన్ని ఇక్కడి నుంచే చెబుతున్నానన్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి, వైసీపీ నేతలు, విద్యార్థి నేతల అక్రమ అరెస్ట్ లను జగన్ ఖండించారు. ప్రత్యేక హోదా కావాలంటూ ప్లకార్డు పట్టుకుని జగన్ కొద్దిసేపు పాదయాత్ర చేశారు. హుస్సేన్ పురంలో జరిగిన మహిళా సదస్సులో జగన్ ప్రసంగించారు. చంద్రబాబువన్నీ శుష్క వాగ్దానాలేనన్నారు.
ఆలస్యంగా పాదయాత్ర.....
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. నిన్న సాయంత్రం డోన్ నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. బనగానపల్లె నియోజకవర్గంలో జగన్ కు అద్భుతమైన ఆదరణ లభించింది. ఇక డోన్ లోనూ అదే రీతిలో యాత్ర కొనసాగనుంది. నిన్న రాత్రి గోర్లగుట్ట క్వారీ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో జగన్ బస చేశారు. ఈరోజు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతోంది. జగన్ మరో 13 రోజుల పాటు కర్నూలు జిల్లాలోనే పర్యటించే అవకాశముంది. పాదయాత్ర రోజుకు 13 కిలోమీటర్ల కంటే ఎక్కువగా సాగడం లేదు. అభిమానుల తాకిడి.. కార్యకర్తల హడావిడి... మధ్యలో మీటింగ్ లతో పాదయాత్ర ఆలస్యమవుతోంది. మొత్తం జగన్ పాదయాత్రకు కర్నూలు జిల్లాలో విశేషమైన స్పందన లభిస్తుందని చెప్పొచ్చు.