జగన్ వీరిని టార్గెట్ చేశారా?

Update: 2017-10-25 00:30 GMT

వైసీపీ స్పీకర్ పై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందా...? వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన శాసనసభ్యుల రాజీనామాలపై వత్తిడి తేవాలని వైసీపీ నిర్ణయించుకుంది. జగన్ పాదయాత్ర చేపడుతున్న సమయంలో ఇటు ఎమ్మెల్యేలపై ప్రెషర్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి జగన్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. వీరందరినీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది రాజీనామాలు అప్పడే స్పీకర్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ దీనిపై ఇంతవరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కనీసం దానిపై విచారణ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులను బర్త్ రఫ్ చేయకపోవడమే ప్రధాన కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ మారి ఏళ్లు గడుస్తున్నా వారిపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

రాజీనామాలు ఇచ్చామంటున్న.....

ఆరు నెలల క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన నలుగురు మంత్రులు అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలు స్పీకర్ కు అందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయకపోయినా... మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు రాజీనామాల లేఖలు స్పీకర్ కు పంపామంటున్నారు. సాంకేతికంగా మంత్రి పదవిని పొందాలంటే అది అవసరం కూడా. అందుకే అదే సమయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుజయకృష్ణ రంగారావు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాననికూడా చెప్పారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తన రాజీనామా లేఖను అందజేశానని, ఉప ఎన్నికలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని రంగారావు అప్పట్లో ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాని ఏ రాజీనామా విషయంలోనూ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. జగన్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో స్పీకర్ ను, పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయం వైసీపీ తీసుకుంది. మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా తాను రాజీనామా లేఖను ఎప్పుడో స్పీకర్ కు పంపానని, స్పీకర్ వద్దనే పెండింగ్ లో ఉందని చెప్పడం విశేషం.

Similar News