వేల కొద్దీ దరఖాస్తులు... ఇబ్బడి ముబ్బడిగా వినతులు. ఇదీ వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో కన్పిస్తున్న దృశ్యాలు.వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించి నేటికి 42 రోజులయింది. ఇప్పటి వరకూ దాదాపు నలభై వేలకు పైగా వినతులందినట్లు చెబుతున్నారు. అంటే రోజుకు వెయ్యికి పైగానే వినతులు వైఎస్ జగన్ వద్దకు వస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో జరుగుతుంది. ఆయన ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర చేశారు.
నలభై వేలకు పైగా వినతులు....
జగన్ పాదయాత్రకు పొడవునా అనేక వినతులు అందుతున్నాయి. ముఖ్యంగా తమకు పక్కా ఇళ్లు లేవని, పింఛను రావడం లేదని, రుణాలు అందడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఉపాధి అవకాశాలు లేవని ఇలాంటివే ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తున్నాయి. తమకు ఉద్యోగం లేదని, ఇప్పించాలని వ్యక్తిగత దరఖాస్తులు కూడా వీటిలో ఉన్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, శస్త్ర చికిత్సకు నిధులు మంజూరు చేయాలన్న వినతులూఉన్నాయి. అయితే వీటన్నింటినీ వైసీపీ కార్యాలయ సిబ్బంది కేటగిరీలుగా విభజించి కంప్యూటరీకరిస్తున్నారు. ఏ విభాగం కింద దరఖాస్తులు వస్తున్నాయో వాటికింద చేరుస్తున్నారు. అంతేకాదు జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామంతో పాటు ఆ వినతిని ఇచ్చిన వ్యక్తి పేరు, ఫోన్ నెంబరును కూడా ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు.
అన్నింటీనీ కంప్యూటరీకరిస్తూ....
అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలో వచ్చిన వ్యక్తిగత, సామూహిక సమస్యలను పరిష్కరించాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను వెంటనే కంప్యూటరీకరించాలని, వాటిని జిల్లాల వారీగా ఫైల్ చేయాలన్న ఆదేశాలు సిబ్బందికి అందాయి. ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూసిన జగన్ వీటిని ఒక కాపీని ప్రభుత్వానికి కూడా పంపే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించినా.. లేకున్నా.. ఏ శాఖకు ఆ శాఖకు చెందిన ప్రతిపాదనను త్వరలోనే పంపనున్నారని తెలసింది. మొత్తం మీద జగన్ పాదయాత్రలో వెల్లువలా వచ్చిన వినతులను పక్కన పెట్టకుండా వాటిని పరిష్కరించాలన్న ఆలోచన లో ఉన్నారంటే జగన్ ఆ సమస్యలపై ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుందని వైసీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్ ఇప్పటికే 550 కి పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.