వైసీపీ అధినేత జగన్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారా? ఇటు బీజేపీని గట్టిగా అనలేక మదనపడిపోతున్నారా? మరోవైపు లెఫ్ట్ పార్టీతో చెలిమిని కంటిన్యూ చేయడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రజాసమస్యలపై ఎవరు ముందుండి పోరాడితే వారే హీరోలు. అయితే జగన్ మాత్రం ఏపీ విభజన హామీల విషయంలో కొద్దిగా బీజేపీని, ఎక్కువగా టీడీపీని విమర్శించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. విభజన హామీలు అమలు కాకపోవడానికి టీడీపీ పాత్ర ఉందన్నది కూడా ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినప్పుడే టీడీపీ ఎదురుతిరగాల్సి ఉండగా ప్యాకేజీ కోసం పాకులాడటం ఆ పార్టీ చేసిన తప్పే. దీనిని అందరూ అంగీకరిస్తారు.
బీజేపీని కొద్దిగా...టీడీపీని ఎక్కువగా....
అయితే గత నాలుగు రోజులుగా పార్లమెంటు సాక్షిగా జరిగిన విషయాలను పరిశీలిస్తే జగన్ పార్టీ ఎటువైపు అన్నది ఎవరూ చెప్పలేరు. పార్లమెంటులో నిరసనలు తెలియజేయడం తప్ప బీజేపీపై గట్టిగా మాట్లాడింది లేదు. తోటి టీడీపీ ఎంపీలు బీజీపీని కడిగిపారేస్తుంటే వైసీపీ మాత్రం సైకిల్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇది నిజంగా ఆపార్టీ చేసిన తప్పే అని చెప్పక తప్పదు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుంటే నిలదీయాల్సింది కేంద్రాన్నే తప్ప రాష్ట్రాన్ని కాదన్నది ఎవరికీ తెలియంది కాదు. కాని జగన్ మాత్రం లోపల ఎక్కడో బేజేపీతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం.
అసలు వ్యూహమేంటి?
ఇక ఏపీలో వామపక్షాలతోనూ జగన్ మైత్రిని కంటిన్యూ చేస్తున్నారు. ఈ నెల8వ తేదీన వామపక్షాలు పిలుపునిచ్చిన ఏపీ బంద్ కు జగన్ పార్టీ పూర్తిగా మద్దతిచ్చింది. స్వయంగా జగన్ కూడా ప్లకార్డు పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. గతంలోకూడా ప్రజాసమస్యలపై వామపక్షాల వెంట ఉండి జగన్ పార్టీ పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేయాలని జగన్ భావిస్తున్నట్లు కూడా అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జగన్ చేసిన ప్రకటన జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. జగన్ ఎటూ తేల్చుకోలేకే రెండు పడవల మీద కాళ్లు పెడుతున్నారా? లేక వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారా? అన్నది పార్టీలోనే పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. కేంద్రంపై పోరాటం విషయంలో జగన్ లో ఇంతవరకూ ఒక స్పష్టత లేదన్నది వాస్తవం. ఇదే కంటిన్యూ చేసుకుంటే జగన్ పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు.