జగన్ యాత్ర సూపర్ హిట్ చేయాలని సీనియర్లు...?

Update: 2017-12-31 01:30 GMT

జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమయిన రోజున కన్పించిన నేతలు మళ్లీ చిత్తూరు జిల్లాలో ఎంట్రీ ఇచ్చారు. జగన్ పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్రను చిత్తూరు జిల్లాలో సూపర్ హిట్ చేయాలన్న లక్ష్యంతో వైసీపీ శ్రేణులు విపరీతంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న తంబళ్లపల్లి నియోజకవర్గంలో పాదయాత్రకు మంచి రెస్పాన్స్ కన్పిస్తోంది. ఈ యాత్రలో ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, భూమన కరుణాకరెడ్డి, ద్వారకానాధరెడ్డి పార్టీ జెండాలు చేతబూని జగన్ వెంట నడవటం కన్పించింది.

రంగంలోకి దిగిన విజయసాయి...

చిత్తూరు జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేయడానికి విజయసాయి రంగంలోకి దిగారు. ఆయన ఇటీవల కాలంలో పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. స్థానిక నేతలలో చర్చించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నది విజయసాయిరెడ్డి మాత్రమే. అందుకే కర్నూలు, అనంతపురం జిల్లాలో కన్పించని విజయసాయిరెడ్డి చిత్తూరు జిల్లాలో కన్పించడం పార్టీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లా తర్వాత పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకోనుంది. నెల్లూరు జిల్లా విజయసాయి సొంత జిల్లా కావడంతో అక్కడి నేతలతో కూడా చర్చించడానికి విజయసాయి వచ్చారని చెబుతున్నారు.

మంచి స్పందన....

ఇక తంబళ్లపల్లిలో జరుగుతున్న పాదయాత్రకు అనూహ్య స్పందన కన్పిస్తోంది. మహిళలు దారిపొడవునా హారతులతో స్వాగతం పలుకుతున్నారు. పూలవర్షం కురిపిస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం కొత్తపల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో జగన్ మొక్క నాటారు. అనంతరంబోరెడ్డివారి కోటకు చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 47వ రోజు జగన్ మొత్తం 14.3 కిలోమీటర్లు నడిచారు. వసంతపురం, ఉప్పులూరు వాండ్లపల్లె, తంబళ్లపల్లి మీదుగా రామిగానివారి పల్లె చేరుకుని అక్కడ జగన్ పాదయాత్ర ముగించారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

నేటి షెడ్యూల్....

ఇక జగన్ పాదయాత్ర నేడు 48వ రోజు జరగనుంది. మూలపల్లి క్రాస్ రోడ్స్ నుంచి బయలుదేరిన జగన్ ఎర్రసానిపల్లి, ఎద్దులవారిపల్లి, కన్నెమడుగు, కె.రామిగానివారి పల్లి, రేణుమాకులపల్లి క్రాస్ రోడ్స్, తిమ్మయ్యగారి పల్లి, పరదేశి పల్లి, దాదంవారి పల్లి, తుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ముడివీడు వరకూ పాదయాత్ర కొనసాగనుంది.

Similar News