జగన్ యాత్ర సక్సెస్ కు వీళ్లే కారణమా?

Update: 2017-12-09 01:30 GMT

జగన్ ప్రజా సంకల్ప యాత్ర 30వ రోజుకు చేరుకుంది. ఇప్పటికి కడప, కర్నూలు జిల్లాల్లో జగన్ యాత్ర జరిగింది. కడప ఎటూ సొంత జిల్లా కాబట్టి సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. కాని కర్నూలు జిల్లాకు వచ్చే సరికి వైసీపీ నేతల్లో కొంత టెన్షన్ మొదలయింది. కర్నూలు జిల్లాలో అప్పటికే ఇద్దరు ఎంపీలు జంప్ అయ్యారు. ఎమ్మెల్యేలు టీడీపీ పంచన చేరిపోయారు. దీంతో కర్నూలు జిల్లాలో పాదయాత్ర సక్సెస్ అవుతుందా? లేదా? అన్న టెన్షన్ వైసీపీ నేతలను పట్టిపీడించింది. అయితే నేతలు వెళ్లిపోయినా యువనేతలు మాత్రం జగన్ యాత్రను దగ్గరుండి దిగ్విజయం చేసినట్లు వైసీపీ పార్టీ స్కానింగ్ రిపోర్ట్ చెబుతోంది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు నాని, శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు ఇలా నేతల కుమారులంతా రంగంలోకి దిగి జగన్ వెంట తమ మందీ మార్బలంతో నడిచారు. అంతేకాదు బహిరంగసభలను, రైతులతో ముఖాముఖి, మహిళాసదస్సు వంటి వాటిని కూడా యువనేతలే దగ్గరుండి సక్సెస్ అయ్యేట్లు చేశారట. దీంతో జగన్ కర్నూలు జిల్లా నుంచి అనంతపురం వెళ్లిన తర్వాత వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారి డ్యామేజీ జరిగినా యువనాయకత్వం జగన్ వెన్నంటే ఉండి విజయవంతం చేసిందని వైసీపీ సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.

నేడు 30వ రోజు యాత్ర.....

ఇక అనంతపురం జిల్లాలోనూ అదే పరిస్థితి కన్పిస్తోంది. అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ భారీగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు జగన్ ఏకంగా ఈ జిల్లాలో 250 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. మొత్తం 8 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇక్కడ కూడా సక్సెస్ చేయాలని వైసీపీ నేతలు నిరంతరం కృషిచేస్తున్నారు. అనంతపురం జిల్లాలో పోయిన చోటే వెదుక్కునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ జిల్లాలో నాలుగురోజులు జగన్ పర్యటించారు. నాలుగు రోజుల యాత్ర విజయవంతమైందనే వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈరోజు జగన్ యాత్ర శింగనమల నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 8గంటలకు పాపినేని పాలెం నుంచి బయలుదేరే యాత్ర జంబులదిన్నె, తండా, గార్లదిన్నె గ్రామాల్లో జగన్ పర్యటిస్తారు. గార్లదిన్నెలో భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి మార్తాడుకు చేరుకుని రాత్రి బస చేస్తారు. మొత్తం మీద జగన్ అనంత యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.

Similar News