జగన్ మరో మైలురాయి దాటేశారు

Update: 2018-03-28 01:30 GMT

ప్రజాసమస్యలను తెలుసుకుంటూ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ 1600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని సత్తెన పల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడులో 1600 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఈ సందర్భంగా జగన్ అక్కడ ఒక మొక్క నాటారు. ప్రతి వంద కిలోమీటర్లకు జగన్ ఒక మొక్క నాటుతున్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్రను జగన్ ప్రారంభించారు. ఇప్పటికి ఆరు జిల్లాల్లో పాదయాత్ర ను పూర్తి చేసుకుని ఏడో జిల్లా అయిన గుంటూరులో పాదయాత్ర చేస్తున్నారు.

ఆరు నియోజకవర్గాల్లో....

ఈ నెల12వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకూ పొన్నూరు, బాపట్ల, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లిలో పాదయాత్ర చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్రకు అశేష స్పందన లభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న జగన్ మరికొద్ది రోజుల్లోనే కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఇంకా ఆరు జిల్లాల్లో యాత్ర పూర్తి చేయాల్సి ఉంది.

ఎండలు మండుతున్నా...

ప్రత్యేకహదా నినాదాన్ని అందిపుచ్చుకున్న జగన్ పార్టీకి పాదయాత్ర కూడా తోడవ్వడంతో ప్లస్ పాయింట్ గా మారిందంటున్నారు. మండుతున్న ఎండల్లో జగన్ పాదయాత్రను చూసేందుకు జగన్ తరలివస్తుండటం చూసి ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఎండలు దెబ్బకు జగన్ నల్లబడిపోయారని వైసీపీ నేత ఒకరు చెప్పారు. జగన్ ది లెక్కచేయని మనస్తత్వం అని, ప్రజల చెంతకు వెళ్లేందుకు ఎండలను సయితం లెక్క చేయడం లేదని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు చెప్పారు. వైద్యులు హెచ్చరిస్తున్నా విన్పించుకోవడం లేదని ఆయన తెలిపారు.

రాజీనామాలకు సిద్ధమా?

సత్తెనపల్లిలో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడపై జగన్ నిప్పులు చెరిగారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. రాజీనామాల అంశాలను పక్కనపెట్టేందుకే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. అందుకే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారన్నారు. నాలుగేళ్ల నుంచి కన్పించని అఖిలపక్షం ఇప్పుడే కన్పించిందా? చంద్రబాబూ? అని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు నిరవధికంగా వాయిదా పడినా తమ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేస్తారని, చంద్రబాబు కూడా అదేరోజు తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని జగన్ డిమాండ్ చేశారు.

Similar News