హస్తినలోనూ, ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వైసీపీ అధినేత జగన్ నిశితంగా గమనిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా బీజేపీ, టీడీపీల మధ్య గ్యాప్ పెరగడం, పొత్తు విచ్ఛిన్నమవుతున్న తరుణంలో జగన్ సీనియర్ నేతలతో చర్చించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పష్టంగా చెప్పడంతో భవిష్యత్ కార్యాచరణను జగన్ త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చేసినందున పార్లమెంటు సభ్యుల చేత ముందుగానే రాజీనామాలు చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకూ జగన్ వచ్చినట్లు తెలిసింది.
త్వరలోనే ఎంపీలతో భేటీ.....
శని, ఆదివారాల్లో పార్లమెంటుకు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో మరోసారి పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశం కావాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. వారి సమక్షంలోనే రాజీనామాల తేదీని ముందుకు తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. వైసీపీ తొలి నుంచి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే నినాదాన్ని అందుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా రాజీనామాలను పార్లమెంటు సమావేశాలు ముగిసే సమయంలో చేస్తే బాగుండదని పలువురు జగన్ కు సూచించారు.
అవిశ్వాసం తర్వాత....
అందుకోసం మార్చి 21వ తేదీన అవిశ్వాసం పెట్టాలని జగన్ ముందుగా ప్రకటించారు. ఈ అవిశ్వాసం తర్వాత రాజీనామా చేయాలని జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఆగకుండా అంతకంటే ముందుగానే రాజీనామా చేస్తే పార్టీకి మైలేజీతో పాటు హోదా నినాదాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లేందుకు వీలుంటుందని పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంపీల సమావేశంలో వారి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే రాజీనామాలపై జగన్ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
పర్చూరులో జనస్పందన....
ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర పర్చూరు నియోజకవర్గంలో జరుగుతుంది. పర్చూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు.అయితే పర్చూరు నియోజకవర్గంలో నేతలందరూ కలిసి సమిష్టిగా యాత్ర విజయవంతానికి కృషి చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గం పాదయాత్రలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పర్చూరు నియోజకవర్గం సమన్వయ కర్త రావి రామనాధం బాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చెంచుగరటయ్య, గొట్టిపాటి భరత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు తమ సమస్యలపై జగన్ కు వినతి పత్రం ఇచ్చారు.