జగన్ మనసులో ఇంత బాధ ఉందా?

Update: 2017-12-27 08:30 GMT

జగన్ కొన్ని విషయాల్లో తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారు. పాత సంఘటనలను మర్చిపోలేక పోతున్నారు. జగన్ డైరీ చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ తన డైరీలో కొంత బాధను వెళ్లగక్కారు. జగన్ ప్రతిరోజూ తన పాదయాత్రలో జరిగిన సంగతులను డైరీలో రాసుకుంటారు. ఇలా రాసుకున్న డైరీలో 44వ రోజు డైరీ పేజీకి ఒక ప్రత్యేకత ఉంది.

కోర్టుకు వెళ్లాల్సి రావడంతో...

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని జగన్ తన డైరీలో పేర్కొన్నారు. పాదయాత్రను నిర్విఘ్నంగా కొనసాగించాలనుకున్నానని, ఎన్ని ఇబ్బందులెదురైనా ముందుకు సాగాలని భావించానని, కాని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి రావడం బాధకల్గిస్తుందన్నారు. కోర్టు అనుమతి రాకపోవడంతో జనం మధ్య ఉండలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది బాధ కలిగించినా తప్పనిసరి పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు.

పులివెందులకు వెళ్లలేక...

అలాగే ఏటా క్రిస్మస్ వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య గడిపేవాడినని, పులివెందులలో జరిగినే ప్రార్థనల్లో పాల్గొనేవాడనని, కాని ఈసారి పులివెందులకు క్రిస్మస్ కు వెళ్లకపోవడంత బాధకలిగించిందన్నారు. కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీని ప్రజల మధ్యలో ఉన్నందుకు వెళ్లలేకపోయానన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకునే పండగకు దూరం కావడం బాధించిందన్నారు. అయినా కుటుంబ సభ్యుల సమక్షంలో పాదయాత్ర వద్దనే పండుగ జరుపుకోవడం ఓ ప్రత్యేక అనుభూతినిచ్చిందని ఆయన తన డైరీలో పేర్కొన్నారు. ఇక ప్రతిరోజూ నడక ప్రారంభించే సమయానికి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కాని అప్పటికే తన కోసం ఎందరో బారులు తీరి ఉండటం చూసి మనసు చలించిపోతుందని చెప్పారు. మొత్తం మీద ఇన్నాళ్లూ రాసిన డైరీకి... 44వ రోజు రాసిన డైరీ పేజీలో జగన్ మనసులో బాధను కొంత బయటకు చెప్పినట్లే కన్పిస్తుంది.

Similar News