జగన్ మనసంతా అక్కడే...!

Update: 2017-11-19 12:30 GMT

జగన్ మనసంతా ఆ జిల్లా పైనే ఉంది. జగన్ ను గత ఎన్నికల్లో ఆ జిల్లా దెబ్బకొట్టింది. ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలన్న తపనతో జగన్ ఉన్నారు. ప్రస్తుతం పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతోంది. మరో వారం రోజుల అనంతరం అనంతపురం జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశిస్తుంది. అనంతపురం జిల్లాలో దాదాపు నెలరోజులకు పైగానే ఈ పాదయాత్రను వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. గత ఎన్నికల్లో దెబ్బ కొట్టిన జిల్లాలో తిరిగి లేచి నిలబడాలన్నది వైసీపీ నేతల ప్రయత్నం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా రెండింటిలోనే వైసీపీ గెలిచింది. మిగిలిన పన్నెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. రెండు పార్లమెంటు స్థానాలను వైసీపీ గెలుచుకోలేకపోయింది. దీంతో జగన్ ఈసారి అనంతపురంలో ఎలాగైనా డబుల్ డిజిట్ ను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నా... జగన్ అనంతపురంనేతలతో దాదాపు రోజూ మాట్లాడుతూనే ఉన్నారు.

నిత్యం నేతలతో మాట్లాడుతూ....

అనంతపురం జిల్లాలో దాదాపు 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రకు ముందే జగన్ అనంతపురం జిల్లాపై దృష్టి పెట్టారు. పాదయాత్రకు ముందే యువభేరి, చేనేత కార్మికుల సదస్సుకు జగన్ అనంతపురం వచ్చారు. దీంతో అనంతపురంపై ఆయన ఎంత దృష్టి పెట్టారన్నది అర్థమవుతోంది. అయితే పాదయాత్రతో పాటు ఇక్కడ నేతలకు కూడా కొత్త వారిని దించే యోచనలో జగన్ ఉన్నారు. ముఖ్యంగా యువనేతలకు జగన్ ఇక్కడ స్థానం కల్పించే అవకాశముంది. అనంతపురంలో గత ఎన్నికల్లో గెలిచిన రెండుసీట్లలో ఒకరిని టీడీపీ ఎగరేసుకుపోయింది. కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా పార్టీని వీడి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి నియోజకవర్గ ఇన్ ఛార్జితో జగన్ నిత్యం టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ఏర్పాట్లపై ఆయన వారితో మాట్లాడుతున్నారు. మొత్తం మీద జగన్ కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ మనసంతా అనంతపురం మీదే ఉన్నట్లుంది.

Similar News