వైసీపీ అధినేత జగన్ బుధవారం తేల్చేయనున్నారా? బుధవారం కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వైసీపీ అభ్యర్థి ఎవరో తేలిపోనుంది. ఈ మేరకు కర్నూలు జిల్లా వైసీపీ నేతలకు జగన్ తో భేటీ కావాలని సమాచారం అందింది. జగన్ పాదయాత్ర చేసే చోటనే ఈ భేటీ జరగనుంది. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 12వ తేదీన జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి శిల్పాచక్రపాణిరెడ్డి అనాసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన గౌరు వెంకటరెడ్డి కూడా పోటీకి ఆసక్తి కనపర్చడం లేదు. అయితే ఖచ్చితంగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. గట్టి అభ్యర్థినే బరిలోకిదింపాలని, ఒకవేళ ఓటమి చెందినప్పటికీ అధికార పార్టీకి ఎన్నికను ఏకగ్రీవం చేయడకూడదన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. ఏకగ్రీవమయితే ఆ ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికల్లో చూపిస్తుందని వైసీపీ సీనియర్ నేతలు కూడా భావిస్తున్నారు.
శిల్పా కుటుంబం నుంచేనా?
అయితే పోటీ నామమాత్రంగానే కాకుండా గట్టిగానే పోటీ ఇవ్వాలన్నది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవికిశోర్ రెడ్డిని నిలబెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే దీనికి జగన్ ఓకే చెప్పాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల టిక్కెట్, శిల్పా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం టిక్కెట్ ఇప్పటికే ఖరారు కావడంతో రవికిశోర్ రెడ్డి అభ్యర్థిత్వంపై జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఖర్చు కూడా విపరీతంగా పెట్టాల్సి ఉంటుంది. క్యాంప్ రాజకీయాలు చేయాలి. ఇవన్నీ చేయాలంటే శిల్పా మోహన్ రెడ్డి ఒక్కరికే సాధ్యమన్న వాదన కూడా ఉంది. ప్రస్తుతం అనంతపురం పాదయాత్రలో ఉన్న జగన్ వచ్చే బుధవారం కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో తేల్చనున్నారు.