జగన్ బాటలోనే బాబు...!

Update: 2018-02-21 02:30 GMT

ఎపి రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టిన ప్రధానమైన 19 అంశాలు నెరవేర్చాలి. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అందులో మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. ఇది ఇప్పుడు టిడిపి తమ పోరాటానికి సంబంధించి తాజాగా ఎంచుకున్న ప్రధాన ఎజెండా. టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వాడిగా వేడిగా సాగిన చర్చలో అధినేత చంద్రబాబు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసం పొందాలంటే వారి మనసులో వున్న భావనలని కేంద్రంపై యుద్ధంలో వినియోగించాలని ఎట్టకేలకు చంద్రబాబు డిసైడ్ చేశారు.

మాకూ హోదానే కావాలి ....

14 వ ఆర్ధిక సంఘం పేరు చెప్పి కేంద్రం తమను మోసం చేసి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజి ఇస్తామని నమ్మించిందన్నది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బాబు ఆదేశించారు. ఇకపై ఏ రాష్ట్రానికి హోదా ఉండదని చెప్పి కొన్ని రాష్ట్రాలకు హోదా పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడంతో టిడిపి ఎపి ప్రజల దగ్గర మైనస్ లో పడింది. అదే సమయంలో విపక్ష వైఎస్సాఆర్ పార్టీ తొలి నుంచి హోదాను టిడిపి కేంద్రానికి తన స్వప్రయోజనాలకోసం తాకట్టు పెట్టిందని కోడై కూసింది. ప్రతిపక్ష ప్రచారాన్ని తాజా గా కేంద్రం ప్యాకేజీ కి మొండి చెయ్యి చూపడంతో ప్రజల్లో టిడిపి దోషిగా బిజెపి తో పాటు నిలవాలిసిన పరిస్థితి ఎదురైంది. దాంతో బాబు ప్రత్యేక ప్యాకేజీ పై యూటర్న్ ఇప్పుడే తీసుకోకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదాన్ని పసిగట్టారు. దానికి తోడు ఇతర రాష్ట్రాలకు హోదా పొడిగించడం టిడిపి ని మరింత ఆందోళనకు గురిచేసింది. ఇక చేసేది లేక నిజాలు ప్రజలతో పంచుకుని అందరిలాగే తాము మోస పోయామని ప్రజల్లోకి వెళ్లేందుకు టిడిపి సన్నద్ధమైంది. చట్టంలో వున్నవి ప్రధాని గా మన్మోహన్ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరాలన్న ఎజెండానే తమ పోరాటం లో తీసుకువెళ్ళాలని తెలుగుదేశం నాలుగేళ్ళతరువాతైనా బలంగా భావించడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. మొత్తం మీద జగన్ ప్రత్యేక హోదా నినాదాన్ని చంద్రబాబు కూడా తాజాగా భుజానకెత్తుకున్నట్లు తెలుస్తోంది.

Similar News