జగన్ బాటలోనే నడుస్తున్న పవన్ కల్యాణ్!

Update: 2016-11-10 16:53 GMT

విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయమైనా ఉండవచ్చు గాక.. కానీ వాస్తవానికి ఆయన ఇంచుమించుగా జగన్ బాటలోనే నడుస్తున్నారు. ఈ మాటను ఒప్పుకోవడానికి పవన్ కోటరీ అంగీకరించకపోవచ్చు. కానీ.. ప్రత్యేకహోదా కోసం కేంద్రం మీద పోరాటం ప్రకటించడం మాత్రమే కాదు.. పోరాటం నడుపుతున్న తీరు కూడా జగన్ అడుగుజాడల్లోనే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

జగన్ అడుగుల్లోనే పవన్ నడుస్తున్నట్లు తెలిపే కొన్ని అంశాలు :

- జగన్ ఎప్పటినుంచో ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెబుతున్నారు. కాకపోతే జగన్ రెండున్నరేళ్లుగానూ పోరాటం చేస్తూనే ఉన్నారు. పవన్ ఇటీవలి నుంచే తన పోరాటానికి శ్రీకారం చుట్టారు.

- జగన్ ప్రత్యేక రైలు లో కార్యకర్తలను ఢిల్లీ తీసుకువెళ్లి.. ఢిల్లీలో పెద్దస్థాయిలో ధర్నా నిర్వహించి వచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లాలని సంకల్పిస్తున్నారు.

- హోదా డిమాండ్ ను వినిపించడానికి జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే డిమాండ్‌తో ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా రాలేదు.

- చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రాజకీయ అవినీతి మితి మీరిపోయిందని జగన్ చాలాకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొత్తగా అనంతపురం సభలో అచ్చంగా ఇదే పాట పాడడం ప్రారంభించారు.

- జగన్మోహన రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం బహిరంగ సభలు నిర్వహించడం మాత్రమే కాకుండా, ఇంజినీరింగ్ విద్యార్థులు యువతలో చైతన్యం కలిగించడానికి ప్రత్యేకంగా వారితో భేటీ అవుతున్నారు. ఇటీవల విశాఖ సభకు ముందు కర్నూలులో విద్యార్థులతో జగన్ భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అనంతపురం సభ తరువాత శుక్రవారం నాడు ఆయన గుత్తిలో ఇంజినీరింగ్ విద్యార్థులతో భేటీ కాబోతున్నారు.

... ఇలా అచ్చంగా జగన్ అడుగుజాడల్లోనే పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేకహోదా కోసం తన పోరాట పంథాను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అది తప్పేమీ కాదు గానీ.. ఇంతకూ ఇద్దరిలో ఏ ఒక్కనాయకుడైనా నిజంగా హోదాను సాధిస్తారా లేదా అనేది ప్రజల సందేహంగా ఉంది.

Similar News