జగన్ ఫోకస్ పెడితే...కలిసి వస్తుందా?

Update: 2017-12-12 01:30 GMT

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం కాపులను బీసీల్లోచేరుస్తూ అసెంబ్లీలోతీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. స్వయానా తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆర్ కృష్ణయ్య దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో కర్నూలు, అనంతపురం జిల్లాలో జగన్ రెండు ఎంపీ స్థానాలను బీసీలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలకు కూడా అధికస్థానాలు ఇస్తామని చెప్పారు. పార్టీ బీసీ కమిటీ సభ్యులు రాష్ట్ర మంతటా పర్యటిస్తున్నారని, పాదయాత్ర ముగిసిన తర్వాత బీసీ సదస్సు ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ చేస్తామని ప్రకటించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా జగన్ పార్టీ నిర్వహించింది. మరి కాపులను బీసీల్లో చేర్చడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెబుతున్న మాటలను బీసీలు నమ్ముతారా? లేక జగన్ పంచన చేరుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

33వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.....

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. జగన్ ప్రజాసంకల్ప యాత్ర 33వ రోజుకు చేరుకుంది. ఆయన ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం 8గంటలకు అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి క్రాస్ రోడ్స్ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్ రోడ్డు మీదుగా ఎస్సీ కానలీకి చేరుకున్న తర్వాత జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ కాలనీ, అక్కంపల్లి క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు సాయంత్రం పాపంపేట వద్ద బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. మొత్తం మీద పాదయాత్రలో ఉన్న జగన్ ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో బీసీలపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

Similar News