వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ఆ పార్టీలో జోష్ పెంచినప్పటికీ మరో రకంగా పార్టీ కి కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. క్యాడర్ ప్రజా క్షేత్రం లోకి వెళ్ళడం పూర్తిగా తగ్గించేశారు. అంతా తమ అధినేత పైనే భారం వేసేసారు. పార్టీ పనితీరు ఎలా ఉందొ ఎప్పటికప్పుడు సమీక్షించే యంత్రాంగం సైతం చోద్యం చూస్తుంది. ఆ పార్టీ పత్రికలో ఫోటో వార్త వస్తే చాలానే ధోరణి బాగా పెరిగిపోవడంతో ఆ విధంగా నేతలు నిత్యం మేనేజ్ చేసుకుని సరిపెట్టేస్తున్నారు. దాంతో జగన్ అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటిగా మారింది.
పార్టీ ఇచ్చిన పిలుపులు తప్ప...
పార్టీ ఇచ్చే కార్యక్రమాలను పూర్తి చేయడం తప్ప ఏపీ లోని మెజారిటీ నియోజకవర్గాల్లో వైసిపి ఇంచార్జ్ లు తమ ప్రాంత సమస్యలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమాలు నిర్మించే పనికి స్వస్తి పలికారు. జన్మభూమి కార్యక్రమాలను వైసిపి బహిష్కరించాలని పార్టీనే పిలుపునివ్వడంతో క్యాడర్ నెత్తిన పాలు పోసినట్లు అయ్యింది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని వైసిపి చక్కగా వినియోగించుకునే వీలుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సభలకు వెళ్లడం గతంలో ఇచ్చిన ఫిర్యాదులు వాటికి పరిష్కారాలు ఎందుకు చేయలేకపోయారో వివరించాలని నిలదీయడం చేస్తే వైసిపి ఇమేజ్ పెరిగేదంటున్నారు. అలాగే అభివృద్ధి పనుల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వివరిస్తే అధికారులు టిడిపి నేతల్లో భయం పుట్టేదని బాధ్యతాయుత ప్రతిపక్షం గా జనం గుర్తించే వారని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో అధికార విపక్ష పాత్రలను టిడిపి వారే వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
నవరత్నాలు, గడప గడప క్లోజ్ తో ...
వాస్తవానికి గడప గడపకి వైఎస్ ఆర్ , వైఎస్ కుటుంబం, నవరత్నాల ప్రచారం వంటి కార్యక్రమాలను పార్టీ క్యాడర్ ముగించి పరీక్షలు పాసైన విద్యార్థిలా మౌనంగా వుంది. జగన్ పాదయాత్ర తో తదుపరి కార్యక్రమాలకు పార్టీ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో అధినేత తమ ప్రాంతానికి చేరుకున్నప్పుడు హంగామా చేద్దామన్న భావనలో పడిపోయింది. అధికారపక్ష నేతలు తమ పార్టీ అధినేతపై మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేసినా పట్టించుకుంటున్న దాఖలాలే లేకుండా పోయాయి. ఇలా కింది స్థాయిలో క్యాడర్ క్రీయాశీలకంగా లేకపోవడం రాబోయే రోజుల్లో వైసిపికి దెబ్బ కొట్టే పరిస్థితే దర్శనమిస్తుంది. మరి ఆ పార్టీ అధినేత వీటిని ఏ మేరకు గుర్తించి చర్యలు తీసుకుంటారో చూడాలి.