ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిదిగంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. మార్చి మొదటి వారంలోనే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఎర్రటి ఎండలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర జరుగుతోంది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా మారింది. మామూలుగా ఉదయం ఎనిమిది గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నియోజకవర్గ నేతలతో మాట్లాడిన అనంతరం ప్రతిరోజూ ఉదయం ఆయన 8 లేదా 8.30గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాదయాత్రను కొంత ముందుగా ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు.
పది గంటలకే విరామం....
ఉదయం ఏడుగంటలకే పాదయాత్రను ప్రారంభించనున్నారు. మామూలుగా అయితే మధ్యాహ్నం 1.30గంటలకు భోజన విరామానికి జగన్ ఆగుతారు. అయితే ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో పాదయాత్రను పది గంటలకే ముగించాలని నిర్ణయించారు. పది గంటలకు ముగించి తిరిగి మూడు గంటలకు యాత్రను జగన్ ప్రారంభించనున్నారు. సాధారణంగా మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని జగన్ 3.45 గంటలకు తిరిగి యాత్రను ప్రారంభిస్తారు. ఎండ దెబ్బకు జగన్ తన పాదయాత్ర షెడ్యూల్ ను మార్చుకున్నారు.
వైద్యుల సూచన మేరకు.....
ఇప్పటికే జగన్ అరికాళ్లకు బొబ్బలు లేచి ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడిమికి ఇంకా అవి పెద్దవయ్యే అవకాశముందని భావించి వైద్యుల సూచనల మేరకు జగన్ ఎండ వేడిమి తగలకుండా యాత్రను ప్లాన్ చేసుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో నడిస్తే వడదెబ్బ తగిలే అవకాశముందని కూడా వైద్యులు చెప్పారు. ఇక రానున్నది ఎండాకాలమే. వచ్చే కొద్దీ ఎండ తీవ్రమవ్వడమే తప్ప తగ్గేది ఉండదు. అందులో కోస్తా జిల్లాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. దీంతో వైద్యులు ఉదయం పది గంటలకే యాత్రకు విరామమివ్వాలని సూచించారు. అయితే రోజుకు పదిహేను కిలోమీటర్లు తగ్గకుండా పాదయాత్ర చేయాలని జగన్ భావిస్తున్నారు. లేకుంటే అనుకున్న సమయానికి ఇచ్ఛాపురం చేరుకునే అవకాశముండదు. దీంతో యాత్ర షెడ్యూల్ లో స్వల్ప మార్పుల చేసి జగన్ నడకను కొనసాగిస్తున్నారు.