జగన్ పాదయాత్ర: బాబు లైట్ తీసుకున్నారా ?

Update: 2017-10-28 11:30 GMT

వైఎస్ జగన్ పాదయాత్ర కు సీన్ లేదంటున్నారు చంద్రబాబు. వైసిపి అధినేత చేపట్టిన ఈ యాత్రలో సీరియస్ నెస్ ఏముందని తెలుగుదేశం అధినేత తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశం గా మారాయి. విదేశీ టూర్ నుంచి అమరావతికి వచ్చిన చంద్రబాబు పార్టీ శ్రేణులతో ముచ్చటించి మీడియా తో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. బాబు వ్యాఖ్యలు అలా ఉండగా యాత్ర ప్రకటించిన నాటినుంచి తెలుగుదేశం లో గుబులు పెరుగుతూ వస్తుందనడానికి మంత్రులు రోజు పాదయాత్రపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పైకి సీన్ లేదని అంటున్న టిడిపి విమర్శలు ఎందుకు చేస్తున్నట్లు అని వైసిపి వర్గాలు దాడి మొదలు పెట్టాయి.

మంత్రులు యనమల , ఆనంద్ బాబు పాదయాత్రపై ఎటాక్ ...

ఒక పక్క పాదయాత్రలో సీరియస్ నెస్ లేదు అని తెలుగుదేశం అధినేత అంటున్న సమయంలోనే రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు వైసిపి అధినేత పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన బాటలోనే మరో మంత్రి ఆనంద్ బాబు జగన్ పై ఆరోపణలు మొదలు పెట్టారు. వారానికి నాలుగు రోజులు చేసేది యాత్రే కాదని వ్యంగ్యాస్త్రాలు టిడిపి సంధించింది. అలాగే పార్టీ ఫిరాయింపులను సాకుగా చూపి అసెంబ్లీ కి భయపడి జగన్ పారిపోయారని వ్యాఖ్యలు చేస్తున్నారు మంత్రులు. ఫిరాయింపు ఎమ్యెల్యేలపై చర్యలు అన్నవి స్పీకర్ పరిధిలోనివి అని వారు చెప్పుకొచ్చారు.

ఫిరాయింపులపై చర్యలు కోరుతూ రాష్ట్రపతికి జగన్ లేఖ ......

ఇదిలా ఉండగా తమ పార్టీ ఎమ్యెల్యేలు పార్టీ మారినా చర్యలు లేవంటూ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ కి జగన్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పీకర్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆయన చర్యలు తీసుకోవడం లేదని ఈ వ్యవహారంపై జ్యోక్యం చేసుకుని రాజ్యాంగ పరిరక్షణ చేయాలని వైసిపి అధినేత లేఖలో కోరారు. మొత్తంమీద పాదయాత్ర , అసెంబ్లీ బహిష్కరణ, రాష్ట్రపతికి లేఖ ద్వారా ఫిరాయింపు ఎమ్యెల్యేలపై చర్య కోరడం వంటి అంశాలతో వైసిపి ఏపీలో లో పొలిటికల్ హీట్ కి తెరతీసింది.

Similar News