పవన్ కల్యాణ్ జోరు పెంచారు. ఎన్నికల దగ్గర పడే సమయంలో ఇక షూటింగ్ లు కాదు ప్రజాక్షేత్రమేనని ఒక్కొక్క నిర్ణయంతో చెప్పకనే చెబుతున్నారు. జిల్లాల్లోనూ, రెండు రాష్ట్రాల రాజధానుల్లో పార్టీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఆదేశించిన జనసేనాని తాజాగా పార్టీ సమన్వయ కర్తలను నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. కేవలం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే పార్టీ కో ఆర్డినేటర్లను నియమించనున్నారు. జనసేన జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన శిబిరాలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారు 65 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ డేటా అంతటినీ జనసేన ఐటీ విభాగంలో రికార్డు చేసి ఉంచారు. వీరిలో సుమారు ఎనిమిది వేలమందితో జనసేనాని తొలి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎనిమిది వేలమందికి పార్టీ త్వరలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీరందరికీ ఇప్పటికే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎస్ఎంఎస్ లు, ఈమెయిల్స్ ద్వారా సమాచారం పంపారు.
జగన్ పాదయాత్ర రోజునే.....
ఇక పార్టీ కో ఆర్డినేటర్లుగా పనిచేసేందుకు ఎవరు ఉత్సాహంగా ఉన్నారో.. ఎవరు సమర్థత కలిగిన వారో తెలుసుకున్న తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ సమన్వయ కర్తలను ఎంపిక చేయనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచే ప్రారంభించనున్నారు. తొలి విడత శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు జరిపి కో -ఆర్డినేటర్లను నియమించనున్నారు. డిసెంబర్ 7వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో 840 మంది అభ్యర్థిత్వాలను పరిశీలిస్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 20 మంది పేర్లను పరిశీలిస్తారు. ఎంపికైనా సమన్వయకర్తలకు హైదరాబాద్ లో సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ జనసేనను తన పర్యటనకు ముందే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.