వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మరో నెల పాటు అదనంగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అనుకున్న సమయాని కంటే జగన్ పాదయాత్ర మరో నెల రోజుల సమయం ఎక్కువ తీసుకుంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ పాదయాత్ర నవంబర్ 2వ తేదీన ప్రారంభమై ఆరు నెలల పాటు మొత్తం మూడు వేల కిలోమీటర్లు జరగనుంది. అయితే తాజాగా సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ పాదయాత్ర మరో నెల రోజుల పాటు పొడిగించే అవకాశాలున్నాయి. సీబీఐ కోర్టు తీర్పు ప్రకారం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. జగన్ ఏపీలో ఎక్కడ ఉన్న గురువారం రాత్రి పాదయాత్ర ఆగిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్ కు బయలుదేరి రావాల్సి ఉంటుంది. శుక్రవారం కోర్టులో హాజరైన తర్వాత తిరిగి పాదయాత్ర ఆగిన చోటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా నెలలో నాలుగు రోజులు పాదయాత్రకు బ్రేక్ పడనుంది. అంటే ఆరు నెలల్లో దాదాపు 24 రోజులు జగన్ పాదయాత్రకు బ్రేక్ చెప్పాల్సిన పరిస్థితి.
నేతలతో అత్యవసర సమావేశం.....
కోర్టు తీర్పు తర్వాత జగన్ సీనియర్ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పాదయాత్ర పరిస్థితిపై చర్చించారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఖచ్చితంగా పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. అయితే వారానికి ఒక్కరోజు బ్రేక్ పడుతుండటంతో మరో నెలరోజుల పాటు పాదయాత్రను కొనసాగించాల్సి ఉంటుందని జగన్ అభిప్రాయపడినట్లుతెలిసింది. వైసీపీ నేతలు కూడా ఒక్కరోజు పాదయాత్రకు విరామిచ్చినందును ప్రజల్లోకి ఎటువంటి తప్పుడు సంకేతాలు వెళ్లవని, కోర్టు తీర్పు ప్రకారమే తాము బ్రేక్ వేయాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఆ ఒక్కరోజు షర్మిల లేదా విజయమ్మ చేత పాదయాత్ర చేయిస్తే ఎలా ఉంటుందన్న కొందరు నేతల ప్రతిపాదననున జగన్ తిరస్కరించారు. ఒకరోజు బ్రేక్ ఇచ్చి పాదయాత్రను కొనసాగించాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలన్న యోచనలో జగన్ తరుపున న్యాయవాదులు ఉన్నారు.