జగన్ పాదయాత్ర చేస్తున్నా నేతలకు మాత్రం...?

Update: 2017-11-10 00:30 GMT

జగన్ పాదయాత్ర చేస్తున్నా నియోజకవర్గాల్లో నేతలను ప్రజల చెంతకు చేర్చే కార్యక్రమం చేపట్టారు. ఆయన పాదయాత్ర ఏడు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. తాను పాదయాత్రలో ఉన్న సమయంలో నియోజకవర్గాల్లో నేతలు నిర్లక్ష్యం వహించకూడదన్న ఆలోచనతో జగన్ ఎప్పటికప్పుడు నేతలకు కార్యక్రమాలను నిర్దేశిస్తున్నారు. యువభేరి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దయెత్తున కార్యక్రమాలుచేపట్టడంతో పాటు శని, ఆదివారాల్లో కూడా ఆయన పార్టీ నేతలకు కొత్త కార్యక్రమాన్ని నేతల ముందుంచారు.

రచ్చ బండ, పల్లెనిద్ర.....

ఈ నెల 11, 12 తేదీల్లో ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో నేతలు రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టాలని వైసీపీ అధినేత జగన్ నేతలను ఆదేశించారు. పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులు ఈ నెల 11, 12 తేదీల్లో రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పల్లె నిద్రను చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాల్సిందిగా ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలను మాత్రమే కాకుండా నియోకవర్గాల్లో నెలకొన్న సమస్యలతోపాటు వివిధ సామాజిక వర్గాల వారిప్రధాన డిమాండ్లను కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వీటిని పార్టీ కేంద్ర కార్యాలయం క్రోడీకరించి జగన్ కు పంపుతుంది. వాటిని ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర సందర్భంగా వాటిని ప్రస్తావిస్తారు. శాసనసభ్యులతో పాటు నియోజకవర్గాల ఇన్ ఛార్జులు, కో-ఆర్డినేటర్లు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

Similar News