ఒకవైపు జగన్ పాదయాత్ర జరగుతుంటే మరో వైపు సైకిల్ సవారీ చేస్తున్నారు. పాదయాత్రను దెబ్బకొట్టేందుకు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కూడా జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత కాని, అంతకంటే ముందుగాని చేరే అవకాశముంది. పాదయాత్రకు ధీటుగా అధికార పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో ఫ్యాన్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉందంటున్నారు. ఈ నెల 6న ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ ప్రారంభిస్తున్న యాత్రను ఎలాగైనా దెబ్బకొట్టాలని టీడీపీ భావిస్తుంది. ఇప్పటికే దాదాపు ఆరుగురు మంత్రులు రంగంలోకి దిగారు. వీరంతా జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు. వైసీపీని వీడివస్తే ఒరిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని, సర్వేలు వెల్లడిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యేలను నమ్మిస్తున్నారు. దీంతో నలుగరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పసుపు కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు.
మరో నలుగురు ఎమ్మెల్యేలు రెడీ....
జగన్ పార్టీలో ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. తాజాగా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిచేరికతో ఈ సంఖ్య 22కు చేరుకుంది. ఈ సంఖ్యను మరింత పెంచాలన్నది టీడీపీ ఆలోచన. పాదయాత్ర ప్రారంభం కాకమునుపే జగన్ ను మానసికంగా, నైతికంగా దెబ్బతీయాలన్నది సైకిల్ పార్టీ వ్యూహం. అందుకోసం మంత్రలు రంగంలోకి దిగి నలుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని సెట్ చేసేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, రాయలసీమ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఓకే చెప్పేశారు. ఆయన ఈ నెల 6 లేదా 12వ తేదీన టీడీపీలో చేరే అవకాశముంది. అయితే వైసీపీలో మాత్రం కొంత కలవరపాటు కన్పించినా... వెళ్లే వాళ్లని వెళ్లనీయమని జగన్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వారు ఉన్నా ప్రయోజనం లేదని, కొత్తనేతలతో నియోజకవర్గాలను తిరిగి తాము గెలుచుకుంటామని అధైర్యపడవద్దని జగన్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.