వైసిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభావం ఏమీలేదంటూ పైకి ప్రచారం సాగిస్తున్న టిడిపి లోలోన ఆందోళన చెందుతున్నట్లు ఆ పార్టీ వర్గాల వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రకటించిన వెంటనే ఇంటింటి కి టీడీపీ కార్యక్రమాన్ని నెలరోజుల పైబడే అధికారపార్టీ నిర్వహించాలిసి వచ్చింది. అది పూర్తి అయ్యాకా క్యాడర్ ఖాళీ గా ఉంటే జనం ఫోకస్ జగన్ వైపు ఉంటుందని భావించిన టిడిపి వ్యూహ కర్తలు తాజాగా జన్మభూమికి తెరతీశారని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 9 ఏళ్ళ చంద్రబాబు పాలనలో ప్రతి మూడు నెలలు లేదా ఆరునెలలకు ఒకసారి జన్మభూమి, మూడు నెలలకు ఒకసారి శ్రమదానం కార్యక్రమాలతో నిత్యం ప్రజలకు టిడిపి నేతలు కార్యకర్తలు, అధికారులు అందుబాటులో ఉండేవారు. ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అయ్యేవి.
రాజకీయ అవసర కార్యక్రమంగా ...
కానీ 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చాక జన్మభూమి కార్యక్రమాలను ప్రణాళికా బద్ధంగా నిర్వహించిన దాఖలాలు లేవు. క్రమం తప్పకుండా నిర్వహిస్తే ప్రజలు రేషన్ , పింఛన్ , ఇళ్లస్థలాలు, వాంబే గృహాలు , రోడ్లు , డ్రైన్ల వంటి సమస్యలతో దాడి చేస్తారని అవన్నీ పరిష్కరించలేకే రాజకీయ ప్రచార కార్యక్రమం గా తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. వాస్తవానికి ఇంటి ఇంటి కి టిడిపి లో వచ్చిన సమస్యలు పరిష్కరిస్తే జన్మభూమి నిర్వహించాలిసిన అవసరమే లేదని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది అబద్ధాలా అని ప్రశ్నలు వేస్తున్నారు. గత జన్మభూమి సభల్లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలపై ముందు నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసిపి జన్మభూమిని అనుకూలంగా మార్చుకుంటుందా ..?
ఎన్నికల ఏడాది కావడంతో వైసిపి జన్మభూమి సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి తొలిరోజే కనిపించింది. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై, హామీలపై ఎక్కడికక్కడ వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిలదీస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రజలతోనే అడిగిస్తు తమ పార్టీ మీడియా లో హైలెట్ చేస్తున్నాయి. టిడిపి అనుకూల మీడియా సభలను హైలెట్ చేద్దామనుకున్నా నెగిటివ్ కి వచ్చే రేటింగ్స్ పాజిటివ్ కి దక్కక పోవడంతో అరకొర మాత్రమే వాటికి సమయం కేటాయించడంతో అధికార పార్టీ ఆశించిన మైలేజ్ జన్మభూమిలో లభించడంలేదని రాజకీయ నిఘా విభాగాల నివేదిక అధికార పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది.