వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఆర్టీసీ కార్మికులకు అదిరిపోయే గిఫ్ట్ ను ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న పర్యటనలో జగన్ ఆర్టీసీ కార్మికులకు ఈ హామీని ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు లక్షల సంఖ్యలో ఉంటారు. అయితే ప్రయివేటు బస్సులతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుండటంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ వారికి ప్రభుత్వ పరం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎందుకు సిగ్గుపడాలి?
తనకు ఓట్లు వేయకుంటే... ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారని, చిత్తూరు జిల్లాను చూసి చంద్రబాబే సిగ్గుపడాలని జగన్ అన్నారు. చిత్తూరు జిల్లా ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నెట్టుకొస్తున్నారన్నారు. ప్రజలు ఎందుకు సిగ్గుపడతారని... ఏం చేశారని చంద్రబాబుకు ఓట్లెయ్యాలని జగన్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినందుకు చంద్రబాబును చూసి ప్రజలు సిగ్గుపడాలా? అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలను బడికి పంపితే ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటించారు.
54వ రోజు ఇలా....
అయితే శుక్రవారం తంబళ్లపల్లె, కుప్పం నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సదుం మండలం మిట్టపల్లె క్రాస్ రోడ్స్ వద్ద పీటీఎం మండలం బూర్లపల్లెకు చెందిన టీడీపీ ఎంపీటీసీ రమణమ్మ వైసీపీలో చేరారు. కుప్పం నియోజకవర్గం నుంచి 20 మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. వారికి జగన్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం జగన్ 12.2 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 54వ రోజు జగన్ గొడ్లవారిపల్లి శివారు నుంచి యాత్రను ప్రారంభించి శ్రీనివాసపురం, చాల్లవారిపల్లి మీదుగా కల్లూరు వరకూ పాదయాత్ర కొనసాగించనున్నారు.