జగన్ పట్టించుకోకపోవడమే మంచిదైందా?

Update: 2018-01-02 08:30 GMT

వచ్చేస్తున్నారన్నారు.. పార్టీలో చేరేందుకు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా కర్నూలు జిల్లానేతలతో పాటు ఉత్తరాంధ్ర నేతలు కూడా సైకలెక్కేందుకు సిద్ధమవుతున్నారని సిగ్నల్స్ ఇచ్చారు. కాని ఇంతవరకూ జరగలేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉంది. వైసీపీని ఏపీలో వీక్ చేసేందుకు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. వారిలో నాలుగురికి మంత్రిపదవులు దక్కాయి. కొందరికి నామినేటెడ్ పోస్టులు, మరికొందరికి విప్ లాంటి పదవులూ దక్కాయి.

ఇద్దరు మాత్రమే వీడారు....

చివరకు తూర్పుగోదావరి జిల్లా పంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి పార్టీ మారడంతో మరిన్ని చేరికలున్నాయని టీడీపీ నేతలు చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఏకంగా వైసీపీ ముఖ్యనేత ఒకరు పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బయటకు చెప్పేశారు. ఇంకేముంది శ్రీకాంత్ రెడ్డి, బొత్స సత్యానారాయణ, రోజా వంటి పేర్లు కూడా ఈ జాబితాలో చేర్చేశారు. అయితే జగన్ పాదయాత్ర ప్రస్తుతం మూడు జిల్లాలను పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో జరుగుతుంది.

పాదయాత్రకు స్పందన రావడంతో....

అయితే జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక వైసీపీ నుంచి జంపింగ్ లు ఆగిపోయినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆ ధైర్యం ఇక చేయలేరన్నది నేతల నమ్మకంగా ఉంది. అయితే వైఎస్ జగన్ మాత్రం జంపింగ్ విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ‘పోయిన వాళ్లను పోనివ్వండి’ అన్న రీతిలో ఉంటున్నారు. ఇది కూడాఒకరకంగా మంచిదేనంటున్నారు వైసీపీ లీడర్లు. ఎందుకంటే పోయేవాళ్లను ఎన్నాళ్లు ఆపగలమన్నది వారి వాదన. చివరి వరకూ నమ్మకంగా ఉన్నవారే వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారని చెబుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలంతా హాజరై....

ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్రకు వైసీపీలోని ఎమ్మెల్యేలందరూ ఎక్కడో ఒక్కచోటకు వచ్చి హాజరవుతున్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా, నూతన సంవత్సరం రోజున కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు దగ్గరుండి పాదయాత్రను చూస్తుండటం, ప్రజల నుంచి స్పందన చూడటంతో ఇక పార్టీని వీడే ప్రసక్తి లేదని కొందరు తేల్చి చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కూడా ఇక పార్టీలో చేర్చుకునేందుకు పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదని తెలిసింది. ఇప్పటికే నేతలతో నియోజకవర్గాలు నిండిపోయి ఉన్నాయి. బలమైన నేత వస్తే తప్ప ఎమ్మెల్యే వస్తున్నారని చేర్చుకోవడం వేస్ట్ అని టీడీపీ అధినేత కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పాదయాత్ర ప్రారంభమైన తర్వాత పెద్దయెత్తున వైసీపీ నుంచి వలసలు ఉంటాయని భావించిన వారికి నిరాశే ఎదురైందని చెప్పక తప్పదు. ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వీడారు. వారిద్దరూ ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.

Similar News