వైసీపీ అధినేత జగన్ నైట్ మీటింగ్ లు బాగానే పనిచేస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి నైట్ మీటింగ్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. పాదయాత్ర ముగించిన తర్వాత రాత్రి 8గంటల ప్రాంతంలో స్థానిక కీలక నేతలతో జగన్ మంతనాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో వారికి హితబోధ చేస్తున్నారు. స్థానిక నేతల్లో ఉన్న విభేదాలను కూడా నైట్ మీటింగ్ లలోనే పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడికక్కడే విభేదాలున్న నేతలను చేతులు కలిపేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ నైట్ మీటింగ్ లు సక్సెస్ అయినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఇద్దరి నేతల మధ్య జగన్ సయోధ్య కుదిర్చారు. తాను పాదయాత్రలో వెళ్లని నియోజకవర్గాల నేతలను కూడా నైట్ మీటింగ్ లకు రప్పించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నేతలందరూ కలిసి కట్టుగా పనిచేయాలని జగన్ సూచిస్తున్నారు. టిక్కెట్లు రాని వారికి కూడా జగన్ ఈ సమావేశాల్లో భరోసా ఇస్తున్నారు. దీంతో ఈ సమావేశాల నుంచి అప్పటి వరకూ ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు భుజాల మీద చేతులు వేసుకుని వెళ్లడం కన్పిస్తోందని వైసీపీ నేతలు చమత్కరిస్తున్నారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే....
జగన్ సోమవారం 38వ రోజు ప్రజాసంకల్ప యాత్ర చేయనున్నారు. ఈరోజు కూడా ధర్మవరం నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ధర్మవరం మండలంలోని నడిమిగడ్డ పాల్ క్రాస్ రోడ్స్ లో పాదయాత్ర ప్రారంభమవుతుంది. పదిగంటలకు బిల్వంపల్లి చేరుకుంటుంది. అక్కడి నుంచి నెలకోట తండాకు చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఎగరవేస్తారు. తర్వాత నెలకోట చేరుకుంటారు. ధర్మవరంలో భోజన విరామానికి ఆగుతారు. అనంతరం బుడ్డారెడ్డిపల్లెకు చేరుకుంటారు. ఆ తర్వాత ఎల్లంకుట్ల మీదుగా తనకంటివారి పల్లికి చేరుకుంటుంది. ఇక్కడే జగన్ రాత్రి బస చేస్తారు.