జగన్ నేడు సింహనాదం చేస్తారా?

Update: 2017-10-10 04:30 GMT

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ అధినేత జగన్ మరోసారి భుజానకెత్తుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రాణవాయువులా భావించే ప్రత్యేక హోదాను జగన్ కూడా ఈమధ్య కాలంలో పక్కన పెట్టారు. బీజేపీకి దగ్గర కావడం కోసమే ప్రత్యేకహోదాను జగన్ మర్చిపోయారన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్రత్యేక హోదాపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. గతంలో అన్ని జిల్లాల్లోనూ యువభేరి పేరిట ప్రత్యేక హోదాపై ముఖ్యంగా యువకుల్లో అవగాహన కల్పించేందుకు జగన్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఈరోజు అనంతపురం జిల్లాలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై నేడు జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పుపట్టనున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారమని వైసీపీ భావిస్తుంది. గతంలో ఇదే అంశంపై జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహారదీక్షకు కూడా దిగారు. అయినా ప్రభుత్వాలు దిగిరాలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కీలకాంశమని భావించిన జగన్ మరోసారి ఈ అంశంపై పోరాటానికి సిద్ధమయ్యారు. అనంతపురం తర్వాత రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో బహిరంగ సభలను నిర్వహించాలని జగన్ నిర్ణయించారు.

అనంతలో పోరుకు పరిష్కారం దొరుకుతుందా?

దీంతో పాటు జిల్లా నేతల మధ్య నెలకొన్న విభేదాలపై కూడా జగన్ దృష్టిపెట్టనున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ఈరోజు వస్తున్న జగన్ పార్టీ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతపురం జిల్లా నుంచి కొందరు నేతలు పార్టీని వీడతారన్న వార్తల నేపథ్యంలో జగన్ వారితో ప్రత్యేకంగా మాట్లాడి భరోసా కల్పించనున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి వైసీపీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. గురునాధరెడ్డి టీడీపీలోకి వెళతారని గతకొద్ది రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురునాధరెడ్డి పార్టీని వీడితే జిల్లాలో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపైన కూడా జగన్ మాట్లాడతారని తెలుస్తోంది. గురునాధరెడ్డి తనను కలిసినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సంకేతాలు కూడా పంపారు. ఇప్పటికే జగన్ ప్రత్యేక హోదాపై కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, కర్నూలు, ఏలూరు ల్లో యువభేరి కార్యక్రమాన్నినిర్వహించారు. మిగిలిన జిల్లాల్లో కూడా యువభేరిని నిర్వహించడానికి జగన్ సిద్ధమవుతున్నారు.

Similar News