వైసీపీ అధినేత జగన్ చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా? జగన్ అరవై రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన జనంతోనే మమైకమై ఉన్నారు. ఆయన ప్రధానంగా సెంటిమెంట్ తో జనం మధ్య నడుస్తున్నారని చెప్పక తప్పదు. ముఖ్యంగా జనం మెదళ్లలోకి వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని నెమ్మదిగా ఎక్కిస్తున్నారు. జగన్ మాటలను కొందరు విని నవ్వుకుంటున్నారు. జోకులు వేసుకుంటున్నారు. అయినా జగన్ మాత్రం అధికారంలోకి వచ్చేది ఖాయమన్న సంకేతాలు ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. వచ్చే ఎన్నికలు జగన్ కు అగ్నిపరీక్ష అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన వైసీపీనిన ఆయన క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. గత ఎన్నికల్లో విజయం అంచుల దాకా వచ్చి అందకుండా పోయింది. ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆయన ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
వేల మందిని కలుస్తూ...
జగన్ దాదపు రెండు నెలల నుంచి జనం మధ్యనే ఉంటున్నారు. ప్రతి పల్లెనూ టచ్ చేస్తూ వస్తున్నారు. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే వైసీపీ బలంగా ఉంది. అందుకే తన ఓటు బ్యాంకు పటిష్టపర్చుకునేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు. ఇప్పటివరకూ మూడు జిల్లాల్లో పూర్తయి నాలుగు జిల్లా అయిన చిత్తూరులో జరుగుతోంది. ప్రతి జిల్లాలో జగన్ పాదయాత్రకు మంచి స్పందనే లభిస్తుంది. అయితే ఆయన ప్రతి చోటా ఒకటే మాట చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో దేవుడు దయతలిస్తే తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని. ఇది తనను పలకరించిన ప్రతి వ్యక్తికీ చెబుతున్నారు.
అందరికి భరోసా ఇస్తూ...
జగన్ పాదయాత్రకు సామాన్య ప్రజలే కాదు వివిధ సామాజిక వర్గాల వారు వచ్చి వినతులు సమర్పిస్తున్నారు. వారితోనూ ఇదే మాట. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఇలా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. అందరికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను సత్వరం పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులు వైసీపీ సానుభూతి పరులకు దక్కడం లేదన్న ఆరోపణలు ఎక్కువగా పాదయాత్రలో జగన్ వద్ద విన్పించాయి. తాము గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశామనే తమకు పింఛన్లు నిలిపేశామని అనేకమంది వినతులు ఇచ్చారు. దీనిపై జగన్ తీవ్రంగానే స్పందించారు. పార్టీలకతీతంగా అందించాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను టీడీపీ ఏకపక్షంగా అందిస్తుందని ఆరోపించారు.
నవ్వుకున్నా...ప్రయోజనమంటున్న....
ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న జగన్ సంక్రాంతి తర్వాత ఆంధ్రలోకి అడుగుపెడతారు. రాయలసీమలో యాత్ర దిగ్విజయంగా పూర్తి కావడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ప్రజల్లో తాను అధికారంలోకి వస్తానన్న నమ్మకం కల్గించేందుకే జగన్ పదే పదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనే మాటను వాడుతున్నారంటున్నారు వైసీపీ నేతలు. దీనిపై కొందరు నవ్వుతున్నా... మరికొందరు వెక్కిరిస్తున్నా ... తమకు పెద్దయెత్తున ప్రయోజనం వచ్చే ఎన్నికల్లో చూస్తామన్న ఆత్మవిశ్వాసం వైసీపీ నేతల్లో కన్పిస్తోంది.