వైసీపీ అధినేత జగన్ ఇచ్చే హామీలను నమ్మి నేతలు కూడా మోసపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా జగన్ పై విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీనైనా చేస్తామని నమ్మించి పార్టీలో కొందరు చేర్చుకుంటున్నారని చంద్రబాబు పరోక్షంగా జగన్ పార్టీ చేరికలపై ప్రస్తావించారు. అనుభవం లేని నాయకులు అధికారంలోకి వస్తే ఏపీ ఏం అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.
అనుభవం లేని నేతలతో......
అలాగే పవన్ గురించి కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు. మనం వేసే రోడ్లపైనే నడుస్తూ, మనం ఇచ్చే పింఛన్లు గురించి తెలుసుకుంటూ ఏం చెప్పాలో తెలియక అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. వారి మాటలను నమ్మవద్దని, వారిని నమ్మితే నట్టేట మునగడం ఖాయమని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలున్నారని, అనుభవం ఉన్న లీడర్లు ఉన్నారని, వారి నేతృత్వంలోనే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కేంద్రం అన్యాయం చేస్తున్నా....
ఆంధ్రప్రదేశ్ కు నాలుగేళ్లుగా కేంద్రం అన్యాయం చేస్తున్నా అభవృద్ధికి ఎక్కడా ఆటంకం కలగనీయకుండా చూసుకోగలిగానన్నారు. 24 గంటలు శ్రమించే తనకు ప్రజలు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రాన్ని శాసించి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. అందుకే నాలుగేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోకుండా నవనిర్మాణ దీక్షలను చేపట్టామన్నారు.
ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకే.....
నవనిర్మాణ దీక్షలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. ప్రజలు ఇప్పటికే ప్రభుత్వంపై 74 శాతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, దాన్ని 80 నుంచి 90 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానన్నారు. ఈరోజు చంద్రబాబు బెంజిసర్కిల్ లో నవనిర్మాణ దీక్షలో పాల్గొననున్నారు. ప్రతి జిల్లాలో దీక్షలు జరగాలని, ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధి కోసం సంకల్పం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.