జగన్ ను తిట్టే గొంతు రివర్స్ అయిందే....?

Update: 2017-11-26 11:30 GMT

ఆనం సోదరులు రాసుకుపూసుకు తిరుగుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆనం రామనారాయణరెడ్డికి మాత్రం పార్టీలో కొంత గౌరవమిచ్చారు. అంతే తప్ప వారిని తెలుగుదేశం పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిత్యం వైసీపీ అధినేత జగన్ ను విమర్శించే ఆనం వివేకా సయితం ఇప్పుడు మౌనముద్రను దాల్చారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ ను తిట్టనిదే ఆనం వివేకాకు నిద్ర పట్టదంటారు. టీడీపీలో చేరిన తర్వాత దీన్ని మరీ ఎక్కువ చేశారు. అయితే కొంతకాలంగా ఆనం వివేకానందరెడ్డి మీడియా ముందుకు రావడం లేదు. తెలుగుదేశం పార్టీ తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. దీంతో పాటు విఆర్ కళాశాల వివాదంలో కూడా ప్రభుత్వం తనకు అనుకూలంగా వ్యవహరించలేదని ఆయన మండిపడుతున్నారు.

ఆనం సోదరుల్లో అసంతృప్తి.....

ఆనం సోదరులు పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినేత చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అయితే సంవత్సరాలు గడిచినా చంద్రబాబు హామీ నెరవేర్చలేదు. ఆత్మకూరు నియోజకవర్గానికి మాత్రం ఆనం రామనారాయణరెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించారు. అంతే తప్ప రాజకీయంగా ఆనం ఫ్యామిలీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ముఖ్యమంత్రిని ఆనం బ్రదర్స్ కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆనం వివేకా టీడీపీ నేతల వద్ద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆనం వివేకాను పలుకరించేందుకు నెల్లూరు ఇన్ ఛార్జి మంత్రి అమర్ నాధ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిలు వెళ్లారు. అయితే ఈ సందర్భంగా వివేకా వ్యాఖ్యలు వారిని విస్మయ పరిచాయి. తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తప్పు చేసిందని వివేకా వారి ముందే కుండబద్దలు కొట్టారట. తమకు పార్టీలో గౌరవం దక్కకపోవడంపై వారి ముందే తన అసంతృప్తిని వెళ్లగక్కడంంతో వారు అవాక్కయి బయటకు వచ్చారట. మొత్తం మీద ఆనం సోదరులు అసంతృప్తితో రగలి పోతున్నారట.

Similar News