జగన్ ను ఆమె ఎందుకు కలిశారు?

Update: 2017-12-12 08:30 GMT

వైసీపీ అధినేత జగన్ ను ఆమె కలిశారు. ఆయన వెంట కొంత దూరం నడిచారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరిటాల ఫ్యామిలీకి పట్టున్న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ ను మద్దెల చెరువు సూరి భార్య భానుతి కలిశారు. జగన్ తో చర్చలు జరిపారు. గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్యకు గురైన సంగతి తెలిసిందే. పరిటాల కుటుంబానికి, గంగుల కుటుంబానికి ఫ్యాక్షన్ తగాదాలున్నాయి. అయితే పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మద్దెల చెర్వు సూరి తదనంతర పరిణామాల నేపథ్యంలో భాను కిరణ్ సూరిని హత్య చేసిన సంఘటనా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్దెల చెర్వు సూరి భార్య భానుమతి జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భానుమతి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన భర్త ఆశయాలను కొనసాగించడానికి కృషి చేస్తానన్నారు. అయితే జగన్ కూడా నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి ప్రజల్లో ఉండాలని భానుమతికి సూచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఎలాంటి బాధ్యతలను పార్టీలో ఇచ్చినా తాను చేస్తానని భానుమతి చెప్పారు.

పాదయాత్ర ఆలస్యంగా....

జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 33వ రోజున ప్రజాసంకల్ప యాత్ర చే్తున్నారు. ముస్లింలతో సమావేశమవుతున్నారు. వారి గోడు వింటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని జగన్ హామీ ఇస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈరోజు జగన్ కూరుకుంట బీసీ కాలనీ నుంచి ప్రారంభించిన యాత్రలో జగన్ ఒక అనాధాశ్రమాన్ని కూడా సందర్శిచారు. అక్కడి అనాథలతో జగన్ మాట్లాడారు. పాదయాత్రకు రాప్తాడు నియోజవర్గంలో మంచి స్పందన లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారని, వైఎస్ తనయుడు జగన్ ను చూసేందుకు వేలాది మంది తరలి వస్తుండటంతో పాదయాత్ర అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగడం లేదని, ఆలస్యమవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ జగన్ 451 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Similar News